కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ఇక తాను కాంగ్రెస్‌ అధ్యక్షుడిని ఎంతమాత్రం కాదని తెలిపారు. కాంగ్రెస్‌కు కొత్త సారథిని వెంటనే ఎన్నుకోవాలని పార్టీ వర్కింగ్ కమిటీకి రాహుల్ సూచించారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి తనదే పూర్తి బాధ్యత అని చెప్పారు. బుధవారం (జులై 3) సాయంత్రం రాహుల్ గాంధీ.. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి 4 పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు.

 

అంతకుముందు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజీనామా నిర్ణయంపై మరోసారి స్పష్టత నిచ్చారు. రాహుల్ రాజీనామాతో మోతీలాల్ వోరాకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ‘పార్టీ ఇక ఆలస్యం చేయకుండా కొత్త అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకోవాలి. ఆ ప్రక్రియలో నేను పాలుపంచుకోను. ఎందుకంటే నేను ఇప్పటికే ఆ పదవికి రాజీనామా చేశా. ఇప్పుడు నేను పార్టీ అధ్యక్షుడిని కాదు. కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ త్వరలోనే సమావేశమైన కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి’ అని మీడియాతో రాహుల్‌ అన్నారు.

 

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మే 25న జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆ వెంటనే రాహుల్ రాజీనామాను సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది.

 

రాజీనామాపై రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో నేతలంతా రాజీనామాలు చేశారు. సీనియర్ నేతలు రాహుల్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ, ఆయన తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రాహుల్ నిర్ణయానికే మొగ్గు చూపినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: