కొద్దిరోజులుగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ రాజీనామాపై నెలకొన్న సందిగ్ధతకు నేడు తెరపడింది. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ చీఫ్‌గా కొనసాగలేనని స్పష్టం చేస్తూ రాహుల్ రాజీనామా త‌ర్వాత‌ లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే వరకు  కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ కురువృద్ధుడు మోతీలాల్ వోరాను నియమించారు. అయితే, వోరా తాత్కాలిక నియామ‌కం వెనుక అనేక అంశాలు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

వోరా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు.  గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. పార్టీకి కొన్ని దశాబ్దాలుగా ఆయన చేసిన సేవలను గుర్తించి పార్టీ చీఫ్ గా ఆయనను ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది.  పార్టీ అన్ని ప్రధాన విధాన నిర్ణయాల్లో ఆయన పాల్గొన్నారు. ఒక దశలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. తాత్కాలిక అధ్య‌క్షుడిగా ఎన్నుకోవ‌డంలో ఈ అంశం సైతం ప్ర‌ధానంగా దోహ‌ద‌ప‌డింద‌ని తెలుస్తోంది.  ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న 90 సంవ‌త్స‌రాల వోరాకు ప‌లు స‌మ‌స్య‌లు సైతం ఈ ప‌ద‌వి తెచ్చిపెట్ట‌నుంది. 


మోతీలాల్ వోరా ముందుకు అనేక స‌వాళ్లు ఉన్నాయంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ల‌క్ష్యం ఆయ‌న ముందుంది. ఇందుకు అధ్యక్ష హోదాలో కొత్త నేత ఎవరైనా కృషి చేసే అవకాశం ఉందా.. ? ఆ నేత ఇందుకు ఎలా ప్రయత్నిస్తాడన్నది, గ్రూపులు కట్టినవారిని ఎలా ఏకం చేస్తాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అనేక బృహత్తర పనులు ఉన్న నేప‌థ్యంలో....ఈ కురువృద్ధుడు ఎలా నెగ్గుకొస్తారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: