తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలు కనబడలేదు. అసెంబ్లీ వ్యవహారాలపై ఎంఎల్ఏలు, ఎంఎంల్సీలకు అవగాహన కల్పించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వం అయినా ఇదే చేస్తుంది లేండి. ఇందులో భాగంగానే అసెంబ్లీ కమిటి హాలులో రెండు రోజుల అవగాహన తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి.

 

మొత్తం 175 మంది ఎంఎల్ఏల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఏకంగా 70 మంది కొత్తవారు ఎన్నికయ్యారు. ఇందులో 67 మంది వైసిపి నుండి ఎన్నికైతే టిడిపి నుండి ముగ్గురు ఎన్నికయ్యారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఎంఎల్ఏలు కొత్తవారైనా సీనియర్లైనా చాలామందికి అసెంబ్లీ వ్యవహారాలపై పెద్దగా అవగాహన ఉండదన్నది వాస్తవం.

 

నిజానికి అసెంబ్లీ సచివాలయం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా కీలకమనే చెప్పాలి. అంతటి కీలకమైన రెండు రోజుల కార్యక్రమానికి టిడిపి నుండి ఒక్క ఎంఎల్ఏ కూడా హాజరుకాలేదు. వైసిపి తరపున గెలిచిన 151 మంది ఎంఎల్ఏలు మాత్రం అందరూ హాజరయ్యారు.

 

రెండు రోజుల అవగాహన తరగతులకు టిడిపి నుండి ఒక్క ఎంఎల్ఏ కూడా ఎందుకు హాజరు కాలేదన్న విషయం చంద్రబాబునాయుడుకే తెలియాలి. అసెంబ్లీ సచివాలయం నుండైతే టిడిపికి ఆహ్వానం అందినట్లు సమాచారం. మరి సమాచారం అందినా కూడా టిడిపి ఎంఎల్ఏలు హాజరుకాలేదంటే ఏమిటర్ధం ? మామూలు అసెంబ్లీ సమావేశాల్లాగే వీటిని కూడా టిడిపి బహిష్కరించిందేమో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: