ఒకే ఒక్క ఓట‌మి తెలంగాణ రాజ‌కీయాల్లో చాలా మార్పుల‌కు కార‌ణ‌మైంది. డిసెంబ‌ర్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అప్ర‌తిహ‌త విజ‌యం సాధించిన తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఏప్రిల్‌లో జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఈ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఉన్న 17 ఎంపీ  స్థానాల్లో హైద‌రాబాద్ మిన‌హా మిగిలిన స్థానాల్లో త‌మ‌దే విజ‌య‌మంటూ కారు - సారు - 16- ఢిల్లీలో స‌ర్కారు అని నానా హ‌డావిడి చేశారు. తీరా ఫ‌లితాలు చూశాక టీఆర్ఎస్ కేవ‌లం 9 సీట్ల‌తో మాత్ర‌మే స‌రిపెట్టుకుంది.


ఈ ఎన్నిక‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ ప‌నిక‌ట్టుకుని ఓడించిన వారంద‌రూ ఎంపీలుగా గెలిచి ఆయ‌న‌కు షాక్ ఇవ్వ‌డం ఒక ఎత్తు అయితే... నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తె క‌విత స్వ‌యంగా బీజేపీ అభ్య‌ర్థి చేతిలో ఓడిపోవ‌డంతో ఆయ‌న జీర్ణించుకోలేక‌పోయారు. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత కేసీఆర్ అండ్ టీంకు గ‌ర్వం త‌ల‌కెక్క‌డంతోనే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఓడిపోయింద‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.


ఇదిలా ఉంటే క‌విత ఓట‌మి నిజామాబాద్ జిల్లాలో ఇద్ద‌రు నేత‌ల రాజ‌కీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేసిందా ? అన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.  తెలంగాణ టీడీపీ సీనియర్  నేతల్లో మాజీ మంత్రి మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు ఒక‌రు. ఉమ్మ‌డి ఏపీలో బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న జిల్లా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పారు. తెలంగాణ ఏర్ప‌డ్డాక రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న మండ‌వ‌ను కేసీఆర్ ఈ ఎంపీ ఎన్నిక‌ల‌కు ముందు స్వ‌యంగా ఇంటికి వెళ్లి మ‌రీ పార్టీలోకి ఆహ్వానించారు.


ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ఇస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఇక అదే జిల్లాకు చెందిన మ‌రో నేత మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి. 2009, 2014 ఎన్నిక‌ల్లో ఓడిన ఆయ‌న్ను కూడా కేసీఆర్ స్వ‌యంగా పార్టీలో చేర్చుకున్నారు. వీరికి మంచి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ వీరిద్ద‌రిని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. ఇందుకు కార‌ణం నిజామాబాద్‌లో ఎంపీ క‌విత ఓడిపోవ‌డ‌మే. ఇక వీరు కూడా కేసీఆర్‌ను త‌మ‌కు ప‌లానా ప‌ద‌వులు కావాల‌ని అడ‌గ‌లేని ప‌రిస్థితి. ఏదేమైనా క‌విత ఓట‌మి ఈ ఇద్ద‌రు నేత‌ల పొలిటిక‌ల్ కెరీర్‌ను గంద‌ర‌గోళంలో నెట్టేసింద‌ని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: