రాష్ట్ర శాసనసభను గతంలో(టీడీపీ పాలనలో) మాదిరిగా కాకుండా తమ హయాంలో హుందాగా నడిపిస్తామని, స్పీకర్‌కు ఎలాంటి తలనొప్పులు రానివ్వబోమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాన్ని సభలో మాట్లాడనిస్తూ వారు చేసే విమర్శలను సహేతుకంగా, దీటుగా ఎదుర్కొందామని ఆయన ఎమ్మెల్యేలకు పిలుపు నిచ్చారు.

 

వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభ కమిటీ హాలు–1లో బుధవారం ప్రారంభమైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పునశ్చరణ తరగతుల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చట్ట సభలో లెజిస్లేటర్లు అబద్ధాలు చెప్పకూడదని, వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఆయా విషయాలపై సంపూర్ణమైన సంసిద్ధత, అవగాహనతో వచ్చినప్పుడే మన ప్రసంగాలు బాగుంటాయని అన్నారు.

 

‘అసెంబ్లీని ఈసారి చాలా హుందాగా నడిపిస్తాం. ఎవరు మాట్లాడాలనుకున్నా.. బంగారంగా సమయం ఇస్తాం. ఏం కావాలంటే అది మాట్లాడుకోవచ్చు. దాన్ని హేతుబద్ధంగా పకడ్బందీగా మనం ఎదుర్కొంటాం. అదే మన బలం. అందువల్ల ఇది చాలా మంచి అసెంబ్లీగా ఉండబోతోందని నేను నమ్ముతున్నాను. చంద్రబాబు గారి మాదిరిగా చట్టాలను మనమే చేస్తాము.. వాటిని మనమే కత్తిరిస్తాము.. అనే పరిస్థితి అసలు ఉండదు. చట్టాలను చేసే సభలో చట్టాలను గౌరవించే విధంగా వ్యవహరిస్తాం కాబట్టి, స్పీకర్‌కు ఎలాంటి తలనొప్పులూ ఉండవు. అందరం కలిసికట్టుగా ఈ సభను చక్కగా నడిపిద్దాం.

 

ఒక విషయంపై బాగా మాట్లాడాలనే తపన మీకుండాలి. ఆ తపన లేకపోతే అసెంబ్లీలో ఎవరూ రాణించలేరు. నేను ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇంటి వద్ద తెల్లవారుజామునే బాగా ప్రిపేర్‌ అయ్యి వచ్చే వాడిని. ఆ సబ్జెక్ట్‌తో సంబంధం ఉన్న వారిలో నలుగురైదుగురు కూడా ఇంటికి వచ్చి వివరించే వారు. మెటీరియల్‌ పూర్తిగా చూసుకుని మార్కింగ్‌ చేసుకుని అసెంబ్లీకి వచ్చే వాడిని. అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: