కేసీఆర్ పైకి జగన్ కు స్నేహ హస్తం అందించినప్పటికీ కేవలం తెలంగాణ ప్రయోజనాలు దృష్టిలో మాట్లాడతాడని చాలా మందికి తెలుసు. ఇప్పుడే అదే విషయం జగన్ కు కూడా అర్ధం అయ్యింది. ఇందుకు నిదర్శనంగానే బుధవారం గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల భేటీని జగన్ అర్ధాంతరంగా రద్దు చేశారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయినా కేసీఆర్ అసలు రంగేమిటో జగన్ కు ఎలా అర్థం అయ్యిందన్న విషయానికి వస్తే... ఇటీవల ప్రగతి భవన్ లో జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో... 9 - 10 షెడ్యూళ్ల కింద ఉన్న సంస్థల విభజనపై చర్చ జరిగిన సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ వాదించారట.


ఈ సంస్థలకు సంబంధించిన బ్యాంకు అకౌంట్లలోని మొత్తాన్ని ఇరు రాష్ట్రాలకు పంచేందుకు సుముఖత వ్యక్తం చేసిన కేసీఆర్... ఆ సంస్థల స్థిరాస్తుల పంపిణీకి మాత్రం ససేమిరా అన్నారట.ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఈ రెండు షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు - అప్పులను ఇరు రాష్ట్రాలు జనాభా దామాషా పద్దతిన 58:42 ప్రాతిపదికన పంచుకోవాల్సి ఉంది. అయితే ఆయా సంస్థల బ్యాంకు ఖాతాల్లోని రూ.20 వేల కోట్ల నగదును మాత్రం పంచుకునేందుకు సిద్ధపడ్డ కేసీఆర్... దాదాపుగా రూ.2 లక్షల కోట్ల విలువ చేసే ఆ సంస్థల స్థిరాస్తులను పంచుకునేందుకు మాత్రం ససేమిరా అన్నారట.


ఇదేంటని జగన్ అడిగితే... రాష్ట్ర విభజన సమయంలో ఎక్కడి ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయన్న తనదైన శైలి వాదనను కేసీఆర్ వినిపించారట. అయితే ఆ సమావేశంలో ఈ విషయంపై కేసీఆర్ తో వాదనకు దిగేందుకు తాత్కాలికంగా నో చెప్పిన జగన్... భేటీ ముగిసిన తర్వాత ఏపీకి వచ్చిన వెంటనే న్యాయ నిపుణులతో భేటీ అయ్యారట. విభజన చట్టం మేరకు ఆ సంస్థల స్థిరాస్తులను కూడా పంచుకోవాల్సిందేనని న్యాయ నిపుణులు చెప్పడంతో కేసీఆర్ అసలు రంగేమిటో - ఏపీతో చర్చలకు కేసీఆర్ చూపుతున్న ఆసక్తి వెనుక ఉన్న అసలు కారణాలేమిటో జగన్ కు ఇట్టే అర్థమైపోయాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: