గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా సభలో ఉన్న సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం కల్పించి సభను హుందాగా నడిపిద్దామని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శాసన సభ్యులకు దిశానిర్దేశం చేశారు.

 

ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు ముందు కసరత్తు చెయ్యాలని, ఎంత గొప్ప వ్యాఖ్యాత అయిన అసెంబ్లీలో ఫెయిల్‌ అవుతారని ఆయన అన్నారు. సభలో నిబంధనల ప్రకారం స్పీకర్‌ వ్యవహరిస్తారని, ప్రతి అంశంపై సభ్యుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అవకాశం వచ్చి మాట్లాడకుంటే ఆ సభ్యుడు ఫెయిల్‌ అవుతారని అన్నారు. సరైన ప్రజెంటేషన్‌ లేకుంటే సభ్యుడు రాణించలేడని ఆయన పేర్కొన్నారు. సభా సమయాన్ని వృధా చేయొద్దని, ప్రతి ఒక్క ఎమ్మెల్యే రూల్స్‌ బుక్‌ని చదవాలని ముఖ్యమంత్రి సూచన చేశారు.

 

ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే గత ప్రభుత్వం మైక్‌లు కట్‌ చేసేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ ప్రభుత్వంలో ఉన్న విధంగా ఈ అసెంబ్లీ నిర్వహణ ఉండదని అన్నారు. శాసనసభలో ప్రతిపక్షం అనేది ఉంటేనే బాగుంటుందన్నారు. టీడీపీకీ 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో అయిదుగురిని లాగేస్తే ప్రతిపక్షం ఉండదని తనకు చాలామంది చెప్పారన్నారు.

 

కానీ తాను అలా చేయనని చెప్పానని, పార్టీ మారితే రాజీనామా అయినా చేయాలి, లేకుంటే అనర్హత వేటు అయినా వేయాలని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడేందుకు పూర్తి అవకాశం ఇస్తామని, వారు చెప్పేది కూడా పూర్తి విందామని సీఎం తెలిపారు. ఆ తర్వాత ప‍్రభుత్వం చెప్పే సమాధానంతో ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. మనపై మనకు, పాలనపై అంతకన్న నమ్మకం ఉందని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: