తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క‌ల‌ల నిర్మాణం విష‌యంలో ఆయ‌న‌కు స‌మ‌యం క‌లిసి వ‌స్తోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. కొత్త స‌చివాల‌యం నిర్మాణం విష‌యంలో ప్ర‌భుత్వం దూకుడుగా ముందుకు సాగుతుండ‌గా...విప‌క్షాలు అడ్డుప‌డుతున్న సంగతి తెలిసిందే. ప్ర‌జా ధ‌నం దుర్వినియోగం చేస్తూ నూత‌న స‌చివాల‌యం నిర్మాణం అవ‌స‌ర‌మా?  అంటూ విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తున్నాయి. అయితే, ఈ ఎపిసోడ్‌లో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. సచివాలయాన్ని కూల్చివేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలుచేశారు. భవనాలను కూల్చకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. స్టే, స్టేటస్‌కో ఇచ్చేందుకు నిరాకరించింది. 


ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాలపై న్యాయ సమీక్షకు అవకాశాలు తక్కువ ఉంటాయని హైకోర్టు పేర్కొంది. పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయని తెలిపింది. చట్టవిరుద్ధమైన, అనుచిత, రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు ఉన్నప్పుడే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ కేసు పరిష్కారం అయ్యేవరకు ప్రస్తుత సెక్రటేరియట్‌లోని వివిధ శాఖలను బయటి కార్యాలయాలకు తరలించకుండా అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) నుంచి అండర్‌టేకింగ్ తీసుకోవాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సైతం ధర్మాసనం తిరస్కరించింది. సచివాలయం కూల్చివేతపై కౌంటర్ దాఖలుచేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. కేసును ఈ నెల 18కి వాయిదా వేసింది.


ఇదిలాఉండ‌గా, కోర్టులో సానుకూల ఫ‌లితాల రావ‌డంతో....రెండు భవనాలకు గ‌త‌ నెల 27 న శంకుస్థాపన చేసిన‌ సంగతి తెలిసిందే. నూతన శాసనసభ, సచివాలయ భవనాల నిర్మాణాలకు గ్లోబల్ టెండర్ల ద్వారా నిర్మాణ సంస్థను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థలకు ప్రతిష్ఠాత్మకమైన ఈ రెండు భవనాల నిర్మాణ బాధ్యతలను అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. లేక్ వ్యూ, పచ్చికబయళ్లు, ఫౌంటెయిన్లతో కొత్త భవన సముదాయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా పర్యావరణహిత వాతావరణాన్ని నెలకొల్పేవిధంగా నిర్మించాలని సీఎం అభిప్రాయపడుతున్నారు. వీలైనంత వేగంగా ఈ రెండు భవనాల నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే పాత సచివాలయంలోని సీఎంవో, జీఏడీతో సహా పలు ప్రభుత్వ శాఖలను పక్కనే ఉన్న బీఆర్కే భవనంలోకి తరలించడానికి సాధారణ పరిపాలనశాఖ కసరత్తు చేస్తోంది. ఇది పూర్తయితే నూతన భవనాల నిర్మాణం పనులు వేగం పుంజుకుంటాయి. 


కొత్త సచివాలయ భవనం కోసం సీఎం కేసీఆర్ రెండు నమూనాలను పరిశీలిస్తున్నారు. ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ గతంలో ఇచ్చిన ఓ నమూనాతోపాటు ఈ మధ్యనే చన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్ సంస్థ ఇచ్చిన మోడల్ కూడా సీఎం దృష్టిలో ఉంది. దీర్ఘ చతురస్రాకారంలో ఒకే బ్లాక్‌గా, పొడవుగా కనిపించేలా చన్నై కంపెనీ ఇచ్చిన నమూనాతోపాటు భవనం ఎలివేషన్ కూడా సీఎంను బాగా ఆకట్టుకుందని అధికారులు చెప్తున్నారు. ఇండో- అరబిక్ ఆర్కిటెక్చర్‌తో హఫీజ్ కాంట్రాక్టర్ ఇచ్చిన నమూనాను కూడా సీఎం పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో ఒకదాన్ని ఆయన ఖరారు చేస్తారు. గతవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా నూతన అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: