స్వయంకృషితో ఎదిగి.. ఎందరికో ఆదర్శంగా నిలిచి.. పర స్త్రీ వ్యామోహం, మూఢ నమ్మకాల కారణంగా పతనమై పాతాళానికి పడిపోయాడు.  అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగి...దేశంలో రెస్టారెంట్ చెయిన్‌లకు దార్శనికుడిగా నిలిచిన వ్య‌క్తి  ఈనెల 7నుంచి జీవిత ఖైదును అనుభవించబోతున్నాడు. సుప్ర‌సిద్ధ‌ శరవణ రెస్టారెంట్ వ్యవస్థాపకుడు, దోశ కింగ్‌గా పేరుగాంచిన పి.రాజగోపాల్ జీవితం గురించే ఇదంతా.


ఆకాశం నుంచి అథఃపాతాళానికి చేరిన రాజ‌గోపాల్ జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలు ఉన్నాయి. ఎప్పుడూ తెల్లటి వస్ర్తాలు ధరించి, నుదుటిపై తిలకంతో దర్శనమిచ్చే 71 సంవ‌త్స‌రాల‌ రాజగోపాల్.. తమిళనాడులో నిమ్న సామాజిక వర్గానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి కుమారుడు. 1981లో మద్రాసులో చిన్న దుకాణాన్ని ప్రారంభించాడు. చాలామంది బయట భోజనం చేసేందుకు ఇష్టపడని ఆ రోజుల్లో రాజగోపాల్ ధైర్యం చేసి తన తొలి రెస్టారెంట్‌ను ఆరంభించాడు. తక్కువ ధరలో రుచికరమైన దోశ, వడ, ఇడ్లీలను మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. ఆయ‌న‌ ఫార్ములా విజయవంతమైంది. దేశవిదేశాలకు శరవణ రెస్టారెంట్ విస్తరించింది. ప్రస్తుతం దేశంలోనే కాకుండా అమెరికా, గల్ఫ్, యూరప్, ఆస్ట్రేలియాలో శరవణ రెస్టారెంట్‌కు 80కిపైగా శాఖలున్నాయి.


అయితే, ఈ ద‌శ‌లోనే రాజ‌గోపాల్ బ‌ల‌హీన‌త‌ల‌కు లొంగిపోయాడు. 2000 సంవత్సరంలో ఓ జ్యోతిష్యుడి మాట విని.. తన రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి కుమార్తెను తన మూడో భార్యగా చేసుకునేందుకు రాజగోపాల్ విఫలయత్నం చేశాడు. అప్పటికే వివాహమైన ఆ యువతి..వివాహం చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పింది. దీంతో ఆమెపై ఒత్తిడి తెచ్చేందుకు రాజగోపాల్ అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ ఏవీ ఫలించలేదు. చివరకు 2001లో ఆమె భర్తను హత్య చేయించాడు. అయితే, ఈ విష‌యంలో రాజ‌గోపాల్ పాత్ర బ‌య‌ట‌ప‌డింది. దీంతో 2004లో కోర్టు ఆయనను దోషిగా తేల్చి..10 సంవ‌త్స‌రాల‌ జైలు శిక్ష విధించింది. బాధితులు పై కోర్టులో అప్పీల్ చేయగా.. రాజగోపాల్‌కు కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో నేటి నుంచి జైలులో శిక్ష అనుభ‌వించ‌నున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: