అవ‌కాశాల స్వ‌ర్గ‌దామంగా పేరొందిన అమెరికాలో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ఉదంతంలో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగపరిచారనే ఆరోపణలపై నలుగురు భారతీయ అమెరికన్లను అరెస్ట్ చేసింది. ఈ మేర‌కు అమెరికా న్యాయ విభాగం వెల్లడించింది. విజయ్ మానె, వెంకటరమణ మన్నం, ఫెర్నాండో సిల్వా, సతీశ్ వేమూరిపై వీసా నేరాలకు సంబంధించిన అభియోగాలు మోపినట్లు తెలిపింది. నిందితులందరినీ 2,50,000 డాలర్ల పూచీకత్తుపై విడుదల చేసినట్లు తెలిపింది. వారిపై నమోదైన అభియోగాల ప్రకారం గరిష్ఠంగా ఐదేండ్ల జైలు, 2,50,000 డాలర్ల చొప్పున జరిమానా పడే అవకాశం ఉంది.


హెచ్1బీ అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. దీని ద్వారా అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు వీలవుతుంది. అమెరికా న్యాయ విభాగం వివరాల ప్రకారం.. విజయ్, వెంకటరమణ, వేమూరి.. న్యూజెర్సీలోని మిడిల్‌సెక్స్ కౌంటీలో ప్రొక్యూర్ ప్రొఫెషనల్ ఇంక్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ ఇంక్ పేరిట రెండు ఐటీ స్టాఫింగ్ (ఐటీ నిపుణులను అందించే) కంపెనీలను నడుపుతున్నారు. అలాగే సిల్వా, వెంకటరమణ.. క్లయింట్ ఏ పేరిట మరో కంపెనీని నిర్వహిస్తున్నారు. ప్రొక్యూర్, క్రిప్టో కంపెనీల ద్వారా విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసాలను అందిస్తున్నారు. అయితే వీసా దరఖాస్తులను వేగవంతం చేసేందుకు, సదరు విదేశీ ఉద్యోగి ఇదివరకే క్లయింట్ ఏలో పనిచేస్తున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. పోటీసంస్థలపై పై చేయి సాధించేందుకు వీరు వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేశారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: