హైదరాబాద్‌కు చెందిన విశ్వాస్‌ తయారీ రంగంలో వ్యాపారం ప్రారంభించాడు. మందులు, బలవర్ధకమైన పదార్థాల తయారీకి సంబంధించి చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నాడు. పోస్టాఫీస్‌ల ద్వారా పార్శిళ్లను ఎగుమతి చేస్తున్నాడు. అలాగే కొన్ని ముడి సరుకులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాడు. పార్శిళ్ల రూపంలో జరిగే దిగుమతి ఎగుమతుల్లో పెద్ద చికాకు ఎదురైంది.

 

హైదరాబాద్‌లో తపాలా శాఖకు సంబంధించి ఫారిన్‌ పోస్టాఫీస్‌ లేకపోవటంతో కస్టమ్స్‌ ఎగ్జామినేషన్‌ కోసం పార్శిళ్లను ముంబై పంపుతున్నాడు. కొన్ని పార్శిళ్ల క్లియరెన్సుకు పక్షం రోజుల నుంచి నెలకు పైబడి సమయం పడుతోంది. అలాగే కస్టమ్‌ డ్యూటీ ఎంత చెల్లించాలో ముందు తెలియక అప్పటికప్పుడు ముంబై పరుగెత్తాల్సి వస్తోంది. ఇది కేవలం విశ్వాస్‌ ఒక్కడి సమస్యే కాదు.

 

చివరకు ఇతర దేశాల్లో ఉండే బంధువులకు పంపే పార్శిళ్లలో కూడా ఇదే సమస్య ఏర్పడుతోంది. దేశంలోనే ఓ ప్రధాన నగరంగా భాసిల్లుతున్న హైదరాబాద్‌కు ఇంతకాలం ఇదో సమస్య. ఈ సమస్య పరిష్కరించాలంటూ ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌కు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నగరంలో ఫారిన్‌ పోస్టాఫీస్‌ ఏర్పాటు చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇది పూర్తిస్థాయిలో పని ప్రారంభించనుంది.

 

సమస్యను గుర్తించిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఈసీ) దేశవ్యాప్తంగా అదనంగా ఫారిన్‌ పోస్టాఫీసులను ఏర్పాటు చేయాలంటూ 2016లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్‌ను కూడా చేర్చింది. కానీ దాని ఏర్పాటులో జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు తపాలా శాఖ సెంట్రల్‌ ఎక్సైజ్‌ విభాగంతో కలసి ఇప్పుడు ఫారిన్‌ పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేసింది. నగరంలోని హుమాయూన్‌నగర్‌ తపాలా కార్యాలయంలో ఇందుకు కొంత స్థలాన్ని కేటాయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: