పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీ నేడు ముంబయి కోర్డు ఎదుట హాజరయ్యారు. ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్య ఘటనపై స్పందిస్తూ రాహుల్‌.. భాజపా-ఆరెస్సెస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ ఆరెస్సెస్‌ కార్యకర్త రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌పై నేడు ముంబయి కోర్టు విచారణ చేపట్టింది. రాహుల్‌ విచారణకు హాజరై.. తానేం తప్పుచేయలేదని న్యాయస్థానం ముందు తెలిపారు.

 

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రాహుల్‌కు రూ. 15 వేల పూచీకత్తుతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మాజీ ఎంపీ ఏక్తానాథ్‌ గైక్వాడ్‌ రాహుల్‌కు హామీ ఇచ్చారు. ఈ కేసులో బెయిల్‌ పొందిన అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. ‘నాపై దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ పోరాటాన్ని నేను ఆస్వాదిస్తున్నాను’ అని తెలిపారు.

 

ప్రముఖ జర్నలిస్టు అయిన గౌరీలంకేశ్‌ 2017 సెప్టెంబరు 5న బెంగళూరులోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యపై అప్పట్లో రాహుల్‌ స్పందిస్తూ.. ‘భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపై దాడులు జరుగుతాయి. హత్యకు గురవుతారు కూడా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో దృతిమన్‌ జోషీ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త రాహుల్‌ గాంధీపై ఫిర్యాదు చేశారు. రాహుల్‌తో పాటు సీతారాం ఏచూరీ పేరును కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

రాహుల్‌పై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసును గతంలో విచారణ చేపట్టిన మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.దీంతో పాటు థానె జిల్లాలోని భివాండీలోనూ రాహుల్‌ పరువు నష్టం కేసు ఎదుర్కొంటున్నారు. మహాత్మాగాంధీ హత్యకు సంఘ్‌ కార్యకర్తలే కారణమంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలకు ఓ ఆరెస్సెస్‌ కార్యకర్త కోర్టులో పరువు నష్టం దావా వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: