ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా తరగతుల ప్రారంభం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబుపై సీఎం జగన్‌ యథాతథంగా బురదజల్లే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ..

 

“నాకు అబద్ధాలు చెప్పడం అలవాటే’’ అని చంద్రబాబు ఒప్పుకున్నట్టు శిక్షణా తరగతుల్లో జగన్‌ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు.‘‘చంద్రబాబుపై జోక్‌ వేయబోయి.. వైఎస్‌ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో జరిగిన రూ.400కోట్ల అవినీతిని మరోసారి ప్రజలకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు’’ అని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

 

సీఎం జగన్‌ ఆనాటి అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ చదివి వస్తే బాగుండేదని హితవు పలికారు. అప్పట్లో చంద్రబాబు మాట్లాడింది ఇదిగో అంటూ లోకేశ్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఫొటోలు షేర్‌ చేశారు. తెదేపా ఆనాడు ఒక వ్యూహం ప్రకారం వైఎస్‌ ప్రభుత్వ అవినీతిని బయటపెట్టిందని.. ఆ వ్యూహంలో ఇరుక్కుంది వైఎస్సేనని అన్నారు.

 

దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన అప్పటి కథనాలను షేర్‌ చేస్తూ రాజశేఖర్‌రెడ్డి ధనయజ్ఞం గురించి ఎంత గొప్పగా రాశాయో చదివి తరించండంటూ లోకేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఎవరో చెప్పిన గాలి మాటల్ని పట్టుకుని ఆకాశంపై ఉమ్మి వేసే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: