ఉండవల్లిలోని తన నివాసంలో నేతలతో ఆయన సమావేశమయ్యారు. పరిష్కారం చేతగాకే ప్రతి సమస్యను తెదేపా ప్రభుత్వంపై నెట్టాలని వైకాపా నేతలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తెదేపాపై నెపం వేయడం ద్వారా తమ చేతకానితనాన్ని కప్పిపెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా నేతలు వాళ్ల గుంత వాళ్లే తవ్వుకుంటున్నారని.. ప్రజావేదిక కూల్చడంతోనే వాళ్ల పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.

 

తాను రోజూ వస్తున్నానని గుంటూరులోని పార్టీ కార్యాలయానికి కూడా నోటీసులు పంపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. వైకాపా దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నన్ను వెంటాడటమే ధ్యేయంగా జగన్‌ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

 

రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. విత్తనాలు, సాగునీటి కొరత, విద్యుత్‌ కోతలు, కరవు ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటిస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తారని ఆయన చెప్పారు.

 

రేపు ప్రకాశం జిల్లాలో, ఈ నెల 9న అనంతపురం జిల్లాలో తాను పర్యటిస్తానని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులంతా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని.. మండల పార్టీ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. ఏపీ విత్తనాలు తెలంగాణలో పంపిణీపై పలువురు నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్లారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: