పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో మూడేళ్ళు పడుతుందని ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో రాజేంద్ర కుమార్ జైన్ అన్నారు. కాఫర్‌ డ్యాం పాక్షికంగానే పూర్తైందని పేర్కొన్నారు. పలు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం ముగిసన నేపథ్యంలో రాజేంద్ర కుమార్‌ జైన్‌ మీడియాతో మాట్లాడారు.

 

ఈ సందర్భంగా... కాఫర్ డ్యాం రక్షణ పనుల పురోగతి, వరద అంచనా వ్యవస్థలపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం 10 వేల క్యూసెక్కుల వరదను అంచనా వేస్తున్నామని...దీని వలన కాఫర్ డ్యాంకు ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. అయితే వరదలు రాకముందే పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు శుక్రవారం అక్కడికి వెళ్తున్నామని తెలిపారు.

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికై కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ. 6,700 కోట్లు విడుదలయ్యాయని సీఈవో రాజేంద్ర కుమార్‌ జౌన్‌ పేర్కొన్నారు.  నిధుల కోసం రాష్ట్రం నుంచి కేంద్రానికి బిల్లులు పంపే విషయంలో కొన్ని ఫార్మాలిటీస్‌ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు చేసిన వ్యయంపై కేంద్రం ఆడిట్ చేసిందని వెల్లడించారు.

 

ఇందులో భాగంగా ఆర్ అండ్ ఆర్ కింద రూ. 1300 కోట్ల వ్యయంపై ఇంకా ఆడిట్ జరుగుతూనే ఉందని పేర్కొన్నారు. అదే విధంగా ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచడంపై కేంద్ర పరిధిలోని ఎస్టిమేషన్ కమిటీ పరిశీలిస్తోందని.. ఈ విషయంపై ఇప్పటికే ఒక మీటింగ్ కూడా జరిగిందని తెలిపారు. పెరిగిన అంచనా వ్యయాలపై మరిన్ని వివరాలు ఇవ్వాలని ఈ కమిటీ రాష్ట్రాన్ని కోరినట్లు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: