ప్రాంతీయ పార్టీల్లో వార‌స‌త్వ నేత‌ల ఎంట్రీ కొన‌సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ ఇప్ప‌టికే ఉండ‌గా, తాజాగా రెండు రాష్ట్రాల పొరుగు రాష్ట్రాల్లోనూ ఇదే ట్రెండ్ జోరుగా కొన‌సాగుతోంది. తాజాగా, ఇద్దరు యువ సినీనటులు ఇపుడు రాజకీయాలపై దృష్టిపెట్టారు. యువనటుల్లో ఒకరు తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్ కాగా..మరొకరు కన్నడ యాక్టర్ నిఖిల్ కుమార స్వామి.  ఈ ఇద్ద‌రూ ఒకేరోజు ముఖ్య‌మైన ప‌ద‌వుల్లో నియ‌మితులు అయ్యారు. 


మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి జేడీ(ఎస్) యూత్ వింగ్ అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఈ సందర్భంగా నిఖిల్ కుమారస్వామి మాట్లాడుతూ..మీ కుటుంబంలో రాజకీయ వారసత్వం కొనసాగుతుందని ప్రశ్నలు రావొచ్చని గతవారమే చెప్పాను. కానీ దేవెగౌడ జీ నన్ను యూత్ వింగ్ అధ్యక్షుడిగా నియమించడంతో కొంత షాక్‌కు గురయ్యా. దేవెగౌడ అభీష్టం, పిలుపుమేరకు ఆయన సారథ్యంలోని పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. నిఖిల్ మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. స్వ‌తంత్ర్య అభ్య‌ర్థిగా బ‌రిలో దిగిన సినీన‌టి, దివంగ‌త అంబ‌రీష్ భార్య సుమ‌ల‌త ఇక్క‌డ గెలుపొందారు.


కాగా, దివంగత తమిళనాడు మాజీ సీఎం ఎం కరుణానిధి మనవడు, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆ పార్టీ యూత్ వింగ్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ఉన్న డీఎంకే రాబోయే ఎన్నిక‌ల‌కు వ్యూహాత్మ‌కంగా సిద్ధ‌మ‌వుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మెజార్టీ సీట్లు కైవ‌సం చేసుకున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టింది. ఇందులో భాగంగా యువ‌త‌ను ఆక‌ట్టుకునేందుకు ఉద‌య‌నిధికి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది.



మరింత సమాచారం తెలుసుకోండి: