రాష్ట్రంలో ఇసుక కొత్త విధానం సెప్టెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. ఈ విధానంలో ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ద్వారా ఇసుకను విక్రయించనున్నారు. నూతన విధానం అమల్లోకి వచ్చేలోపు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇసుకను అందించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. ప్రస్తుతం లభిస్తున్న ధరల కంటే తక్కువకే ఇసుక లభించేలా ధర నిర్ణయం ఉండనుంది. ఇసుక విధానంపై సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్షించారు.

 

ప్రభుత్వం ఇసుక అమ్మకాలు చేపట్టిన తర్వాత ధరలు పెరిగాయన్న అభిప్రాయం రాకూడదు. వినియోగదారులకు, ప్రభుత్వానికి పరస్పరం మేలు జరిగేలా ఇసుక నూతన విధానం ఉండాలి.  పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకూడదు. ఇసుకను చేరవేసే వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్‌ పరికరాలు అమర్చాలి. దీనివల్ల ఇసుక మాఫియాను అరికట్టేందుకు ఆస్కారం ఉంటుంది. అక్రమ తవ్వకాలు, రవాణా చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.

 

నగరాలు, పట్టణాల్లో అదనపు నిల్వపాయింట్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. వినియోగదారుల కోసం యాప్‌, వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేయగానే ఇసుకను ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కంకర నుంచి తీసే ఇసుకను ప్రోత్సహించాలని సీఎం సూచించారు.

 

నెల్లూరు జిల్లాలో సిలికా అక్రమ తవ్వకాల అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. సిలికా పేరుతో ఇసుకను అక్రమంగా తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండడంపై సీఎం స్పందించారు. అక్రమ తవ్వకాలు, రవాణా నిరోధానికి అధికారులు వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించారు. ఇసుక అక్రమ అమ్మకాల ద్వారా గత ఐదేళ్లలో రూ.వేల కోట్ల కుంభకోణం జరిగిందని, ప్రజలపై అమితమైన భారం పడిందని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: