ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైన వైకాపా పతనం.. నేను నివసిస్తున్న ఇంటికి నోటీసులివ్వడం, విశాఖ తెదేపా కార్యాలయానికి నోటీసులు పంపడం, గుంటూరు కార్యాలయానికి వస్తున్నందున నోటీసులివ్వడానికి ప్రయత్నించడం వంటి దుశ్చర్యలతో మరింత తీవ్రమయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. జగన్‌ తనను వెంటాడటమే ధ్యేయంగా పెట్టుకున్నారని ఆరోపించారు.

 

తెదేపా కార్యకర్తలు, పేదలను వేధింపులకు గురిచేసి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే పతనం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో విత్తన సమస్య తలెత్తకుండా చూశామన్నారు. తమ వల్లే ఇప్పుడు రైతులు రోడ్డెక్కారని వైకాపా నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని అన్నదాతలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు గురువారం మీడియాతో మాట్లాడారు.

 

రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నేతలతో చంద్రబాబు మాట్లాడారు. ప్రతి ఒక్కరు చెప్పేది ఓపిగ్గా విన్నారు. ఎన్నికల్లో ఓడిపోయామంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని కార్యకర్తలు వాపోయారు. మనం చేసిన పనులు జనం గుండెల్లో ఉన్నాయని, ఎవరికీ ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామని చంద్రబాబు అన్నారు.

 

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు శుక్రవారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని ఇంటి వద్ద నుంచి ప్రకాశం జిల్లా పర్యటనకు బయలుదేరుతారు. 10.30 గంటలకు చినగంజాం మండలం రుద్రమాంబపురం గ్రామానికి చేరుకుంటారు. వైకాపా నాయకుల దాడిలో మృతి చెందిన తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి గుంటూరు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ఈ నెల 9న అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: