అనుమతి లేకుండానే ఏటా తుంగభద్ర రిజర్వాయరు నుంచి కర్ణాటక భారీగా నీటిని వాడుకుంటోంది. తుంగభద్ర బోర్డు లెక్కల ప్రకారమే ఇది సుమారు 10 టీఎంసీలదాకా ఉంది. తుంగభద్ర డ్యాంలోకి నీరు చేరకముందు, చేరిన తర్వాతా వెనుక భాగం నుంచి అనధికారికంగా నీటిని వాడుకోవడంపై బోర్డు సమావేశాల్లో చర్చ జరుగుతున్నా ఎంత నీటిని వాడుకుంటున్నారన్న దానిపై ఇప్పటిదాకా లెక్క లేదు. దీంతో బోర్డు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

 

మొత్తం 27 ఎత్తిపోతల పథకాలు తుంగభద్ర పరిధిలో ఉన్నట్లు తేల్చారు. ఇందులో 2 పని చేయడం లేదని, 25 పని చేస్తున్నాయని గుర్తించారు. ఈ విషయాన్ని అధికారికంగా ఈ నెల 6న జరిగే సమావేశానికి నివేదించనున్నారు. తుంగభద్ర రిజర్వాయరు నుంచి 168 రోజులు నీటిని తీసుకునేలా ఈ ఎత్తిపోతల పథకాలున్నాయని, 46వేల ఎకరాల ఆయకట్టు ఉందని, 5.295 టీఎంసీల నీటిని కర్ణాటక అనధికారికంగా వాడుకుంటోందని తేల్చిన బోర్డు, 5 టీఎంసీల నీటిని ఆ రాష్ట్ర వాటా నుంచి తగ్గించాలని ప్రతిపాదించింది.

 

ఈ ఎత్తిపోతల పథకాలే కాకుండా అనధికారికంగా అనేక పరిశ్రమలకు, తాగునీటికి తీసుకోవడంతోపాటు భారీసంఖ్యలో పంపుసెట్లు తుంగభద్ర పరిధిలో ఉన్నాయని పేర్కొంది. రాయబసవన్న కాలువ కింద 2018 జూన్‌ నుంచి 2019 మే వరకు 5.608 టీఎంసీలు వాడుకున్నట్లు నివేదించింది. టెలిమెట్రీ సమాచారం ఆధారంగా పరిశీలిస్తే 8.010 టీఎంసీలు వాడుకున్నట్లు తేలింది.

 

దీంతోపాటు ఈ కాలువకు అనుసంధానంగా ఉన్న మరో పథకం ద్వారా నీటిని వినియోగిస్తోందని, రాయబసవన్న కాలువ ద్వారా 2.874 టీఎంసీలను రికార్డుల్లో చూపించకుండా వాడుకున్నట్లు బోర్డు తేల్చింది. ఎడమకాలువ నుంచి ఎక్కువ నీటిని వాడుకుంటున్నట్లు ఫిర్యాదులున్నా ఈ కాలువ కింద వినియోగంపై ఎలాంటి లెక్కలు లేవు. మొత్తమ్మీద 10 టీఎంసీలకు పైగా కర్ణాటక అనధికారికంగా వాడుకోగా దీనిపై శనివారం జరిగే బోర్డు సమావేశంలో చర్చించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: