ఇస్లాం మతానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ నుస్రత్ జహాన్ నుదుటన బొట్టు, మంగళసూత్రంతో పార్లమెంటులో ఎంపీగా ప్రమాణం చేయడం ఆ మతానికి చెందిన కొందరిలో ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. అయినా ఆమె వాటిని పట్టించుకోకుండా తాజాగా ఇస్కాన్ కార్యక్రమానికి వెళ్లారు. కోల్‌కతాలో ఇస్కాన్ సంస్థ నిర్వహించిన వార్షిక రథయాత్ర ఉత్సవానికి సీఎం మమతా బెనర్జీతో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా నుస్రత్ మాట్లాడుతూ.. మతాన్ని, రాజకీయాలను వేరువేరుగా చూడాలని కోరారు.  మతపరమైన ఉత్సవాల్లో రాజకీయాలకు తావులేదని.. విశ్వా సం, నమ్మకంపై అవి ఆధారపడుతాయని నుస్రత్ జహాన్ అన్నారు.


పసుపు రంగు చీర, ఎరుపు రంగు గాజులు, సింధూరం, మంగళసూత్రం ధరించి భర్త నిఖిల్‌జైన్‌తో కలిసి వేడుకలో పాల్గొన్నారు. `కులం, మతంతో సంబంధం లేకుండా ఇక్కడ అన్ని వేడుకల్లో పాల్గొంటాం. స్నేహానికి బెంగాల్ చిహ్నం అని ఆమె అన్నారు.తన మీద ఫత్వా జారీ వార్తలపై స్పందిస్తూ.. నిరాధారమైన వార్తలను పట్టించుకోకండి. నా మతం ఏమిటో నాకు తెలుసు. పుట్టుకతో నేను ముస్లింను. ఇప్పటికీ ముస్లిం యువతినే. ఇది విశ్వాసానికి సంబంధించినది. దీన్ని మనసుతో ఆలోచించాలి. మెదడుతో కాదు` అని అన్నారు. వేడుకకు తనను ఆహ్వానించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.


`మమతా బెనర్జీ ముస్లింల పండుగ (ఈద్)కు వచ్చి మాతో ఆ వేడుకలో పాల్గొంటారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. ఇది నమ్మకం, విశ్వాసానికి సంబంధించినది. మతాన్ని రాజకీయంతో పోల్చడం తగదు. అవి రెండూ వేరువేరు` అని అన్నారు. నుస్రత్ నవ్య భారతానికి ఓ సూచిక. ఇతర మతాల నమ్మకాల్ని గౌరవిస్తూ.. మతాలకతీతంగా అన్ని పండుగల్లో అందరూ పాల్గొనడం భారత్ గొప్పదనాన్ని ఇనుమడింపజేస్తుంది. నుస్రత్ లాంటి వాళ్ళు దీనికి మార్గనిర్దేశనం చేస్తున్నారు అని ఇస్కాన్ ప్రతినిధి రాధా రామ్‌దాస్ పేర్కొన్నారు. అందరితో కలిసిమెలిసి సామరస్యంతో ఉండటమే నిజమైన మతం అని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: