తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులకు ఇది భారీ శుభవార్తే. ఇకపై బ్యాంకు పరీక్షల్ని తెలుగులోనే రాసుకోవచ్చు. నిరుద్యోగులు ఎంతో కాలంగా కోరుతున్న డిమాండ్‌ ఇన్నాళ్లకి నెరవేరినట్లయింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(ఆర్‌ఆర్‌బీ)కు సంబంధించి స్కేల్‌-1 అధికారులు, కార్యాలయ సహాయకుల పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు చేపట్టే పరీక్షలను ఇకపై ఆంగ్లం, హిందీతోపాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు.

 

ప్రాంతీయ భాషల్లో నైపుణ్యముండే వారు ఉద్యోగం సాధించే విషయంలో ఈ నిర్ణయం బాగా ఉపయోగపడుతుందని ఆమె గురువారం పార్లమెంటులో ప్రకటించారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, ఉద్యోగ అవకాశాలను స్థానిక యువత వరకూ విస్తరించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

 

ఇప్పటివరకు ఈ పరీక్షల్ని కేవలం ఆంగ్లం, హిందీల్లో మాత్రమే నిర్వహిస్తుండడంతో స్థానిక భాషల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులు నష్టపోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.  ఇకపై.. తెలుగు, అస్సామీ, బంగ్లా, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూల్లో కూడా నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ-8(2019) మెయిన్స్‌ పరీక్ష నుంచి అమలవ్వనుంది.

 

ప్రస్తుతం దేశంలో 45 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పని చేస్తుండగా, మొత్తంగా 90 వేలమంది సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ నేత ఎల్‌.హనుమంతయ్య ప్రశంసించారు. ఈ సౌకర్యాన్ని జాతీయ బ్యాంకుల్లో నియామక పరీక్షలకూ వర్తింపజేయాలని సూచించారు. రాజ్యాంగ షెడ్యూల్‌లోని అన్ని భాషల్లోనూ ఆర్‌ఆర్‌బీల నియామక పరీక్షలు నిర్వహించాలని ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: