కేంద్ర బడ్జెట్ అంటే మరేమీ కాదు, అది చిట్టాపద్దుల వ్యవహారమే.  ఓ ఇంట్లో కుటుంబ పెద్ద మనకు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుందని నెల నెలా లెక్క వేసుకుంటాడు. అదే నూటా ముప్పయి కోట్ల మందికి సంబంధించినదైతే ఇలా భారీ బడ్జెట్ తో హడావుడి చేస్తారు. ఏది చేసినా ఎవరు చేసినా కూడా అందరికీ కూడూ గూడూ అందిందా లేదా అన్నది చూడాలి


ఇక దేశ బడ్జెట్ విషయానికి వస్తే కూడా అలాగే చేయాలి. బాధ్యత గల పాలకులైతే అలాగే ఉంటారు కూడా. రాను రానూ బడ్జెట్లో కూదా రాజకీయమే కనిపిస్తోంది. అక్కడ కూడా ఏదో బావుకోవాలన్న తాపత్రయమే కనిపిస్తోంది. వీళ్ళకు ఇంతిచ్చాం, వాళ్ళకు అది చేశాం అని చెప్పుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్న దారుణమైన ద్యూత క్రీడ కనిపిస్తోంది.


ఈసారి కేంద్ర బడ్జెట్లో కూడా అదే కనిపించింది. ఈ బడ్జెట్ ని చూసిన వారు ఎవరూ కూడా పెద్దగా సంతోషపడింది లేదు. ఆదాయపు పన్ను పరిమితి పెంపు, ఇంటి రుణాలు వంటివి తప్ప మిగిలినవి అన్నీ కూడా పాలకులు చేయాల్సిన బాధ్యతే. దానికి ఇంత కేటాయించాం అని చెప్పుకోవడం ద్వారా ఆయా వర్గాలా మద్దతు కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందరికీ నీళ్ళు అన్నారు, అది కూడా 2022 నాటికి అన్నారు.


అసలు ఇపుడు నీళ్ళు తాగేందుకు ఎక్కడైనా దొరుకుతున్నాయా. దేశంలో ప్రముఖ నగరమైన చెన్నై దాహానికి అలమటిస్తోంది. అందరికీ ఇళ్ళు అంటున్నారు. ఇది కూడా పెరుగుతున్న జనాభా ఓ వైపు ఉంటే కేటాయింపులు వేరేలా ఉంటున్నాయి. మొత్తానికి చూసుకుంటే మోచేతిలో బెల్లం ముక్క పెట్టి నాకమన్నట్లుగానే ఈ బడ్జెట్ తంతు ఉందని అంతా పెదవి విరుస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: