తాజా బడ్జెట్లో కూడా ఏపికి కేంద్రప్రభుత్వం మొండి చెయ్యే చూపింది. గడచిన ఐదేళ్ళల్లో ఏపి విషయంలో నరేంద్రమోడి ఎటువంటి వైఖరో ప్రదర్శిస్తున్నారో ఎన్డీఏ-2లో కూడా అదే పద్దతి కంటిన్యు చేస్తున్నట్లే ఉన్నారు. ఎన్డీఏ -1లో అంటే మోడికి చంద్రబాబునాయుడుకు పడని కారణంగానే ఏపి విషయంలో కేంద్రం సీతకన్నేసినట్లు ప్రచారం జరిగింది. 


సరే, మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు కదా.  జగన్మోహన్ రెడ్డి సిఎం అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి మోడిని మర్యాద పూర్వకంగా కలిసొచ్చారు. వాళ్ళిద్దరి భేటిలో జగన్ ను మోడి ఆప్యాయంగా హత్తుకున్నారు. తీరా బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం వంగతోట దగ్గర బావే అన్న చందంగా ఏపికి మొండి చెయ్యే చూపారు.


రాష్ట్రంలో అధికారం మారినా మోడి వైఖరిలో  మార్పు రాలేదని అర్ధమైపోయింది. చూడబోతే ఏపి విషయంలో మోడి వైఖరి మారే అవకాశాలు ఏమాత్రం కనిపించటం లేదు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం సూన్యహస్తమే చూపింది. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, జగన్ డిమాండ్ చేస్తున్న ప్రత్యేకహోదా, రైల్వే ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలకు నిధులు, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో ప్రాజెక్టులు ఇలా...ఏది తీసుకున్నా నిధలు సున్నాయే. 


ఏదో మొక్కుబడిగా సెంట్రల్ యూనివర్సిటికి రూ. 13 కోట్లు, ట్రైబల్ యూనివర్సిటికి రూ. 8 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి చేతులు దులిపేసుకుంది. మొత్తం మీద చూస్తే బడ్జెట్ రాష్ట్రాల అవసరాలను బట్టి కాకుండా తన దయవల్లే నిధులు మంజూరు చేస్తుందని అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: