టర్కీపై పెత్తనం చెలాయించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భావిస్తున్నారని, ఇది ఏమాత్రం అగ్రరాజ్యానికి తగదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థ, యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్టు టర్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఒప్పందం కుదురకముందే నాటో మిత్రదేశమైన టర్కీకి అమెరికాతో ఒప్పందం కుదిరింది.

 

అమెరికా నుంచి 116 ఎఫ్‌-35 యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు 1.4 బిలియన్‌ డాలర్లను అమెరికాకు అడ్వానుగా చెల్లించింది. ఈ మేరకు నాలుగు యుద్ధ విమానాలు అమెరికా టర్కీకి పంపింది. టర్కీ పైలట్లకు అమెరికాలో శిక్షణ ఇస్తున్నది. అయితే, ఓ పక్క అమెరికా నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్న టర్కీ మరోపక్క రష్యా నుంచి కూడా అధునాతనమైన ఎస్‌-400 క్షిపణి దాడులను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది.

 

టర్కీ నిర్ణయం అమెరికా, మిత్రదేశాలకు మింగుడు పడటంలేదు. రష్యాతో యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ట్రంప్‌ పలుమార్లు అంకారాను హెచ్చరించారు. ఒకవేళ రష్యాతో యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని కొనసాగించాలని భావించినట్టయితే భారీ ఆంక్షలు మోపుతామంటూ బ్లాక్‌ మెయిల్‌ చేశారు. జపాన్‌లోని ఒసాకా నగరంలో గతనెలలో జరిగిన జీ-20 సభ్యదేశాల సదస్సులో ట్రంప్‌, ఎర్డోగన్‌ భేటీ అయ్యారు. ఈ అంశంపై ఇరుదేశాధినేతలు చర్చించినట్టు సమాచారం.

 

ట్రంప్‌ తీరుపై ఎర్డోగాన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నేషనల్‌ హురియత్‌ నేషనల్‌ మీడియా వెల్లడించింది. ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిలోని వివరాల ప్రకారం... 'వినియోగదారులు సకాలంలో చెల్లింపులు చేస్తున్నప్పుడు వారికి అవసరమైన వస్తువులు అందజే యడంలో మీకొచ్చిన నష్టమేమిటి? డబ్బులు తీసుకొని కావాల్సిన వస్తువులను ఇవ్వలేమని తెలియజేయడం చోర్యమే అవుతుంది' అని ఎర్డోగన్‌ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: