ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం (జులై 5) లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సామాన్యులు బడ్జెట్ చూసిన తర్వాత పెదవి విరుస్తు్న్నారు. సామాన్యుడిపై మరింత భారం పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం, ఇంధన రేట్లు పెరగడం.. మధ్య తరగతి వారికి మరింత భారమని చెబుతున్నారు.

 

కేంద్ర బడ్జెట్ ప్రజల ముందుకు వచ్చిన నేపథ్యంలో తెలుగువారి ‘సమయం’.. జనం నాఢీని తెలుసుకునే ప్రయత్నం చేసింది. బంగారం ధరలు పెరగడంతో సామాన్యుడిపై మరింత భారం పడుతుందని హైదరాబాద్ వాసి సుశీల్ కుమార్ తెలిపారు. ఇంధన ధరలు పెరిగితే.. నిత్యావసర సరకుల ధరలు మరింతగా పెరుగుతాయని.. సామాన్యుడి నెత్తిన భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ధరలు తగ్గుతాయనుకుంటే పెరగడం నిరాశ కలిగించిందని తెలిపారు. బీజేపీ తీరు ఎన్నికల ముందు ఒకలా.. ఇప్పుడు మరోలా ఉందన్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారంపై ట్యాక్స్ పెంచడం నిరాశ కలిగించిందని ప్రవళిక అనే యువతి పేర్కొన్నారు. మధ్య తరగతి వారికి ఇప్పటికే భారమైన బంగారం మరింత భారమవుతుందన్నారు.

 

పెట్రోల్ ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయని ఆవేదన చెందుతుంటే.. మరింత పెంచడం సరికాదని అభిప్రాయపడ్డారు. పేదలు, మధ్య తరగతి వారికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని మల్లేశ్ అనే మరో వ్యక్తి కోరారు. జీఎస్టీతో అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: