మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఏపీ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌. టీడీపీ నుంచి ఒక‌సారి న‌ర‌సారావుపేట ఎంపీగా, మ‌రోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న మంత్రి ప‌ద‌వి రాలేదని చివ‌రి రెండు సంవ‌త్స‌రాల పాటు టీడీపీ అధిష్టానంపై తీవ్ర‌మైన అసంతృప్తితో వ్య‌వ‌హ‌రించారు. చివ‌ర‌కు ఎన్నిక‌ల‌కు ముందు సొంత పార్టీపైనే తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసి మ‌రీ పార్టీ వీడారు. వైసీపీ నుంచి మోదుగుల ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌ని అనుకున్నా జ‌గ‌న్ ఆయ‌న‌కు గుంటూరు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు.


ఈ ఎన్నిక‌ల్లో జ‌య‌దేవ్‌పై పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఇక తాజాగా ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కొద్దిరోజుల క్రితం నియమించ బడిన విజయసాయిరెడ్డిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజ‌య‌సాయి ఇప్ప‌టికే పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా ఉండ‌డంతో ఆయ‌న‌కు రెండో ప‌ద‌వి ఉండ‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌తో విజ‌య‌సాయిని ఆ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ జారీ చేసిన జీవో ఉప‌సంహ‌రించుకుంది.


ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వైసీపీలో ఈ పదవి ఎవరికీ దక్కుతుంది ? ఈ స్థానంలో ఎవ‌రిని నియ‌మిస్తార‌నే చ‌ర్చ మొద‌లైంది. వైసీపీ నుండి 22 మంది ఎంపీలు ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు ఉన్నా వారిలో ఎవ‌రికీ ఈ ప‌ద‌వి ఇవ్వ‌టానికి అవ‌కాశం లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మోదుగుల పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. మోదుగుల గ‌తంలో ఎంపీగా ప‌నిచేసి అటు ఢిల్లీ వ్య‌వ‌హారాల్లో ఇటు రాష్ట్ర ప‌రిపాల‌న మీదా అవ‌గాహ‌న‌తో ఉన్నారు.


ఈ క్ర‌మంలోనే రాష్ట్ర విభ‌జ‌న వ్య‌వ‌హారాల టైంలో పార్ల‌మెంటులో పోరాటం చేసిన మోదుగుల‌కు అన్ని వ్య‌వ‌హారాల్లో గ్రిప్ ఉంటుంద‌నే జ‌గ‌న్ ఈ ప‌ద‌వికి మోదుగుల‌ను ఎంపిక చేయాల‌ని భావిస్తున్నట్టు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: