సుప్రీం కోర్టు తీర్పులను తెలుగులోనూ చదువుకునే అవకాశం రాబోతుంది. ఈ నెలాఖర్లోగా ఏడు ప్రాంతీయ భాషల్లో తీర్పులను ఉంచాలని అత్యున్నత ధర్మాసనం నిర్ణయించింది. దీంతో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మరాఠి, ఒడియా, అస్సామీ భాషల్లో సుప్రీం తీర్పులను ఉంచనున్నారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌కు సుప్రీం ఎలక్ట్రానిక్‌ సాఫ్ట్‌వేర్ వింగ్ రూపకల్పన చేస్తోంది.

 

న్యాయస్థానం తీర్పులకు సంబంధించిన ఇంగ్లిష్ కాపీలను ఆ రోజు సాయంత్రానికి సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో ఉంచుతుండగా.. ప్రాంతీయ భాషల్లోని తీర్పు కాపీలను వారం తర్వాత అప్‌లోడ్ చేస్తారని సమాచారం. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2017 అక్టోబర్లో కేరళ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఫంక్షన్లో పాల్గొన్న రాష్ట్రపతి.. ప్రజలకు న్యాయం చేయడమే కాదు.. దాన్ని వారి మాతృభాషలో చదివి అర్థం చేసుకునే అవకాశం కూడా ఉండాలన్నారు.

 

హైకోర్టులు తీర్పులను ఇంగ్లిష్‌లో వెలువరిస్తున్నాయి. కానీ మనదేశంలో భిన్న భాషలు మాట్లాడే ప్రజలున్నారు. ‘‘న్యాయం కోసం ఆశ్రయించిన వారికి ఇంగ్లిష్ సరిగా అర్థం కాకపోవచ్చు. దీంతో తీర్పును అర్థం చేసుకోవడం కోసం వారు లాయర్ల మీద లేదంటే ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తోంది.

 

ఇది వారికి అదనపు ఖర్చు’’ అని కోవింద్ అభిప్రాయపడ్డారు. తొలుత ఈ జాబితాలో తమిళం లేదు. కానీ డీఎంకే నేత స్టాలిన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ఈ జాబితాలో తమిళంను కూడా చేర్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: