రౌడీయిజం, అరాచకం చేయడానికి మీకు  ప్రజలు అధికారం ఇచ్చారా? అని తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘‘రాష్ట్రంలో తెదేపాకు ఓట్లేసిన వారిని భయపెడుతున్నారు. దాడులు చేసి చంపేస్తున్నారు. పద్మను ఆడబిడ్డ అని కూడా చూడకుండా వివస్త్రను చేసి, పైశాచికంగా ప్రవర్తించారు. ఇందుకు బాధ్యులయిన వాళ్లను కఠినంగా శిక్షించవలసిందే’’ అంటూ డిమాండ్‌ చేశారు.

 

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం రుద్రమాంబపురంలో వైకాపా నాయకుల దాడిలో బలవన్మరణం చెందిన బసంగారి పద్మ కుటుంబాన్ని శుక్రవారం చంద్రబాబు పరామర్శించారు. ఇంతటి హృదయవిదారక సంఘటనను తన జీవితంలో చూడలేదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘ఆడబిడ్డలు శీలం కోసం బతుకుతారు. బసంగారి పద్మ పట్ల వైకాపా వాళ్లు అత్యంత దారుణంగా ప్రవర్తించారు.

 

ఇలాంటి సంఘటనలు సాధారణమేనన్నట్లు హోంమంత్రి మాట్లాడుతున్నారు. మీ కుటుంబానికి, బంధువులకు ఇలా జరిగితే ఊరుకుంటారా? మరో ఆడబిడ్డకు ఇలా జరగకుండా ఉండాలంటే రాష్ట్రంలోని ప్రతి మహిళ స్పందించాలి.’ అని పిలుపు ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి.  రాష్ట్రంలో ఆరుగురిని చంపేశారు. 95 మందిపై దాడి చేశారు.

 

ఒంగోలులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే ఇప్పటికీ నిందితులపై చర్యలు లేవు. పద్మ విషయంలోనూ పోలీసులు సరిగా స్పందించలేదు. పోలీసుల తీరేం బాగా లేదు. పద్మ మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాల మౌనం పాటించారు. ఆమె కుటుంబాన్ని పార్టీ అన్నివిధాలా  ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున రూ. 5 లక్షల సాయం అందించారు. పద్మ ఇద్దరు పిల్లలకు స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెరో రూ. లక్ష వంతున సాయం అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: