సీతమ్మ బడ్జెట్‌లో సిరులేవీ..?

తెలంగాణాకు ఏమి మేలు జరిగింది అనే దిశగా, కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే,నిరాశ, నిట్టూర్పులే మిగిలాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు ఎంపీ స్థానాలు భాజపాకు దక్కడంతో, తెలంగాణకు బడ్జెట్‌ లో మంచి, మద్దతు లభిస్తుందనే అందరూ ఆశించినా, నిర్మలమ్మ నిరుత్సాహాన్నే నింపింది. రాష్ట్ర ప్రభుత్వం నివేదనలకు నిరాశే బదులైంది.

కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి.. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌ ప్రభుత్వం వివిధ అంశాలను కేంద్రం దష్టికి తీసుకెళ్లినప్పటికీ ఒక్క దానికి కూడా బీజేపీ సర్కారు అండగా నిలవలేదు. విభజన చట్టంలో రాష్ట్రానికి కేంద్ర ఇచ్చిన హామీల ముచ్చట అంతకన్నా లేదు.

గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నామమాత్రంగా రూ.4 కోట్లను విదిల్చి, కేంద్రం చేతులు దులిపేసుకుంది. ఉపాధి హమీ పథకానికి కేటాయింపులు గతం కంటే పెరగలేదు. స్వచ్ఛభారత్‌ మిషన్‌కు కేటాయింపులు తగ్గాయి. కొత్త బడ్జెట్‌ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రానికి పన్నుల వాటాగా రూ.19,718 కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

తెలంగాణ కంటే ఎక్కువ మొత్తం పొందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, కేరళ ఉన్నాయి.

తెలంగాణకు ఏమి దక్కింది..?

1, హైదరాబాద్‌లోని అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లొరేషన్‌, రీసెర్చికి రూ.319.39 కోట్లు కేటాయించారు.

2, దేశంలోని సీడ్యాక్‌లన్నింటికీ కలిపి రూ.120 కోట్లు కేటాయించారు. దానిలో హైదరాబాద్‌కూ కొంత దక్కుతుందని అర్ధిక నిపుణులు అంటున్నారు.

3, సింగరేణి కాలరీస్‌ సంస్థకు రూ.1,850 కోట్లు కేటాయించారు.

4, స్వాతంత్ర సమరయోధుల పింఛన్లు, ఇతర ప్రయోజనాల కోసం రూ.952.81 కోట్లు కేటాయించారు. ఇందులో కొంత హైదరాబాద్‌ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధులకు దక్కనుంది.

5, సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి రూ.30 కోట్లు కేటాయించారు. అందులో హైదరాబాద్‌కు కొంత మొత్తం అందనుంది.

మిషన్‌ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా జలశక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం.. ఆ పథకానికి మాత్రం డబ్బులివ్వలేదు. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు అందించే ఈ ప్రాజెక్టుకు రూ. 19,500 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అడుగుతోంది. నీతి ఆయోగ్‌ కూడా ఈ పథకం అద్భుతమని ప్రశసించి నిధులివ్వాలని కేంద్రానికి సిఫారసు కూడా చేసింది. అయినా ఆ సిఫారసులను, కేంద్రం పట్టించుకోలేదు.

మిషన్‌ కాకతీయ పథకానికి కూడా రూ. 5 వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా దానినీ కేంద్రం పట్టించుకోలేదు. (cartoon by mrutyumjaya)

మరింత సమాచారం తెలుసుకోండి: