జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు వరాలు  ప్రకటిస్తూ  దేవుడిలా మారిపోయారు. ఈ వరాలే ఆయనకు ఇప్పుడు ఇబ్బందిగా మారే పరిస్థితి వచ్చింది. వారికిచ్చారు కాబట్టి, మాకు కూడా ఇస్తారనే ధీమాతో చాలామంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తాడేపల్లిబాట పట్టారు. ఏకంగా నిరసన ప్రదర్శనలు సైతం దిగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా సాక్షర భారత్, కల్యాణ మిత్రలు తాడేపల్లిలో నిరసన గళం వినిపించారు. టీడీపీ అనుకూల మీడియా దీన్ని కాస్త భూతద్దంలో చూపించినా నిరసన జరిగింది మాత్రం వాస్తవం.


సాక్షర భారత్ కార్యకర్తలను గతేడాది జూన్ లో టీడీపీ ప్రభుత్వం తొలగించింది. వయోజన విద్య అవసరం పెద్దగా లేకపోవడం, నిధులు పూర్తిగా దుర్వినియోగం అవుతున్నాయన్న కారణంతో ఆ పని చేసినట్టు తెలుస్తోంది. ఇక కల్యాణమిత్ర అనే పోస్ట్ కూడా అప్పటి టీడీపీ కార్యకర్తల కోసం సృష్టించిందే. చంద్రన్న పెళ్లికానుక వివరాల నమోదు కోసం వీరిని ఉపయోగించుకునేవారు. ప్రభుత్వం మారాక వీరికి కమీషన్లు రావడంలేదనేది ఆరోపణ. వాస్తవంలోకి వస్తే.. సీఎం జగన్ భర్తీ చేస్తున్న గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో ఇలాంటి అన్ని పనులు జరిగిపోతాయి.


గ్రామ సచివాలయం కోసం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కాకుండా డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టబోతోంది ప్రభుత్వం. అంటే ఇవి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలే. ఓవైపు ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల అవసరం ఏముంటుంది. అప్పటికీ సాక్షర భారత్ కార్యకర్తలకు విలేజ్ వాలంటీర్ల పోస్టుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం అడిషనల్ సెక్రటరీ మాటిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనంత కాలం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగావకాశాలుంటాయి. ఓవైపు జగన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నప్పుడు ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులు వచ్చి నిరసన తెలియజేస్తే దానికి అర్థమేముంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: