తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌, వైసీపీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి టైం వ‌చ్చింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఈ ఇద్ద‌రి కోసం ఢిల్లీ ఎదురుచూస్తోంద‌ని చెప్తున్నారు. ఇప్ప‌టికే క‌లిసిక‌ట్టుగా న‌డుస్తున్న ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు మ‌రోమారు ఏక‌తాటిపై న‌డ‌వాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ప్ర‌స్తావిస్తున్నారు. ఇందుకు కార‌ణం...కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెటే కార‌ణ‌మంటున్నారు. గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా జ‌రుగుతున్న అన్యాయ‌మే....తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ జరిగింది.


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రసక్తి లేదని నిర్మలా సీతారామన్‌ కొద్ది రోజుల క్రితం పార్లమెంటులో ప్రకటించారు. పోలవరం కేటాయింపుల మీద, ఆంధ్రప్రదేశ్‌కు విభజన చట్టం కింద ఇవ్వాల్సిన నిధుల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అమరావతి నిర్మాణానికి గతంలో ఇచ్చిన నిధుల గురించి ఆర్థికమంత్రి గుర్తు చేశారే తప్ప కొత్తగా ఎలాంటి ప్రకటన చేయలేదు. విజయవాడ, విశాఖ మెట్రో రైలుకు నిధులు విషయంలోనూ ఏపీకి అన్యాయం జరిగింది. 


ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే...రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలకూ బ‌డ్జెట్‌లో దిక్కు లేకుండా పోవటం గమనార్హం. ఆ చట్టంలో తెలంగాణలో గిరిజన యూనివర్శిటీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, స్టీల్‌ ప్లాంటు, రైల్వే లైన్ల వంటి వాటిని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు. గతంలో మాదిరిగానే ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లోనూ వాటికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఇదే సమయంలో జీఎస్డీపీ పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నదంటూ సీఎం కేసీఆర్‌ పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యాన్నీ ఇవ్వలేదు. టీఆర్‌ఎస్‌ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న మిషన్‌ భగీరధ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.25 వేల కోట్ల సాయం చేయాలంటూ నీతి అయోగ్‌ గతంలో సిఫారసు చేసింది. ఆ సిఫారసులను ఈసారి కూడా కేంద్రం తుంగలో తొక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గానీ, పాలమూరు - రంగా రెడ్డికిగానీ ఎలాంటి ప్రాధాన్యతనివ్వకపోవటం గమనార్హం. వాటికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ మోడీ సర్కారు పట్టించుకోలేదు.


తెలుగు రాష్ట్రాల‌కు బ‌డ్జెట్‌లో మొండిచేయి చూపించిన నేప‌థ్యంలో..ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు క‌లిసి క‌ట్టుగా త‌మ గ‌ళం వినిపించాల‌ని ప‌లువురు కోరుకుంటున్నారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవ‌డంలో చూపుతున్న స్ఫూర్తినే...ఇద్ద‌రూ క‌లిసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, హ‌క్కుగా ద‌క్కాల్సిన ప్ర‌యోజ‌నాల విష‌యంలో గ‌ళ‌మెత్తాల‌ని ఆకాంక్షిస్తున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో డైన‌మిక్ సీఎంలుగా పేరొందిన కేసీఆర్‌, జ‌గ‌న్‌ల చ‌ర్య‌ల గురించి ఢిల్లీ రాజ‌కీయ‌వ‌ర్గాలు ఎదురుచూస్తున్నాయ‌ని పేర్కొంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: