తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులపై రెండు రాష్ట్రాల నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది . బడ్జెట్ లో రెండు రాష్ట్రాల్లోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోగా , విభజన హామీల ఊసే ఎత్తలేదు . దక్షిణాది రాష్ట్రాల పట్ల బీజేపీకి ఉన్న వివక్ష ఈ బడ్జెట్ ద్వారా మరోమారు స్ఫష్టమైందన్న విమర్శలు విన్పిస్తున్నాయి . ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ తెలుగింటి కోడలని , ఈమె తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుతారని బడ్జెట్ కు ముందు కమలనాథులు చెబుతూ వచ్చారు . కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది .


దక్షిణాది లో బలపడాలని చూస్తున్న బీజేపీ, బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపుల ద్వారా ఇక్కడి ప్రజల్ని ఎలా ఆకట్టుకుంటుందని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు . దక్షిణాది నుంచి కేంద్రానికి ఎక్కువ పన్నులు వస్తుంటే , దక్షిణాది రాష్ట్రాల్లో తిరిగి ఖర్చు చేయకుండా,  ఉత్తరాది రాష్ట్రాలకు దోచిపెడుతోందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి .  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  నాలుగు స్థానాలను గెలిపించిన తెలంగాణల ప్రజలకు, తాము నీతి ఆయోగ్ సిఫార్సులను కూడా అమలు చేయలేదని చెప్పి, తమను ఆదరించాలని కోరుతారా ? అంటూ రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు . మిషన్ కాకతీయ , మిషన్ భగీరథ పథకాలకు  నీతి ఆయోగ్ 24 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని సిఫార్స్ చేయగా , కేంద్రం ఇప్పటి వరకూ ఒక్క రూపాయ ఇచ్చింది లేదని టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు .


ఆంధ్ర ప్రదేశ్ విషయానికొస్తే రాజధాని నిర్మాణానికి రూపాయ కూడా విదల్చని కేంద్రం , వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని విస్మరించింది . బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు నిధుల వరద పారుతుందని ఆశించిన వారికి నిర్మలాసీతారామన్ గట్టి షాకే ఇచ్చారు . నిధుల వరద కాదు కదా కనీస కేటాయింపులు కూడా చేయకుండా ఏపీ పై కేంద్రం సవతి తల్లి ప్రేమను ప్రదర్శించిందని వైకాపా నేతలు మండిపడుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: