కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసిన ఎవరైనా పెదవి విరుస్తారే తప్ప మంచి బడ్జెట్ అనలేని పరిస్థితి. సామాన్యులకు రుచించని బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారనే అంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజలు చాలా ఆసక్తిగా తిలకించిన బడ్జెట్ ఇది. ఎందుకంటే జగన్ తొలిసారి, టీఆరెస్ రెండోసారి అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో తమ, తమ రాష్ట్రాలకేమిస్తారో నని ఇద్దరు సీఎంలు ఎదురు చూసారు.

 

తీరా చూస్తే మధ్యతరగతికి ఏమాత్రం రుచించని బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. పెట్రోలు, బంగారం, పప్పుధాన్యాలు రేట్లు పెరగడం చాలు.. కేంద్రంపై ప్రజలకు ఆగ్రహం కలగడానికి. ప్రజల పరిస్థితి ఇలా ఉంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం సైలెంట్ అయిపోయారు. బడ్జెట్ పై మౌనం వహించినట్టే కనపడుతోంది. బడ్జెట్ ప్రవేశపెట్టాక ఏపీకి ఏం చేయలేదని విజయసాయిరెడ్డి, తెలంగాణకు అన్యాయం చేసారని కేటీఆర్ తమ బాధను వెళ్లగక్కారు. నిజమే.. రెండు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకమైన ప్రాజక్టులున్నాయి. ఏపీలో అమరావతి నిర్మాణం ఉంది. ఎక్కడా వీటి ఊసులేదు. కేంద్రం నిధులిస్తుందేమో పనులను పరిగెట్టిద్దాం అనుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులకు నిన్నటి బడ్జెట్ శరాఘాతంలా తగిలింది.

 

అయితే ఇక్కడ ఇద్దరు సీఎంలు తమ స్పందన తెలియజేయకపోవడానికి కారణం.. ఇప్పుడేం మాట్లాడినా అది డైరెక్టుగా మోదీని అన్నట్టే అవుతుంది. సీఎంల స్థాయిలో మాట్లాడితే అది మోదీకి వెంటనే చేరిపోతుంది. ఇప్పట్లో మోదీతో పెట్టుకోవడం అనవసరం అనుకున్నారేమో వారిద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఇంకా ఐదేళ్ల పాలన వుంది.. ఈలోపు అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్లైనా పనులు సాధించుకోవచ్చు. ఇప్పుడేం మాట్లడినా.. మొదటికే మోసం వచ్చిందా.. వచ్చేవి కూడా రావు. అప్పుడు మరిన్ని ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఇద్దరు సీఎంలు ఈ సైలెన్స్ మైంటైన్ చేస్తేనే బెటర్.


మరింత సమాచారం తెలుసుకోండి: