కర్ణాటకలో అనిశ్చితిలో ఉన్న  సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభం దిశగా పయనిస్తోంది. మరో 11 మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాజీనామా పత్రాలు సమర్పించారు. ఈ మేరకు ఎనిమిది మంది కాంగ్రెస్‌, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయాన్ని సభాపతి రమేశ్‌కుమార్‌ నిర్థారించారు.

 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన మంత్రి డీకే శివకుమార్‌ రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. తన నివాసానికి వచ్చిన ఎమ్మెల్యేలతో ఆయన మంతనాలు కొనసాగిస్తున్నారు. అయితే, కొన్ని అంశాల్లో పార్టీ నిర్లక్ష్యం చేయడం వల్లే తమ పదవికి రాజీనామా చేసినట్టు ఎమ్మెల్యే రామలింగారెడ్డి తెలిపారు. పార్టీలో తానెవరినీ నిందించడంలేదన్నారు.

 

మరోవైపు, కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుండూరావు ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆయన కూడా రేపు బెంగళూరు చేరుకోనున్నారు. ఎమ్మెల్యేలతో భేటీకి ముందు శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌-జేడీఎస్ పొత్తుకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు.

 

భాజాపా అక్రమ పద్ధతిలో తమ కూటమి మధ్య ఉన్న పొత్తును భగ్నం చేసి, సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకోసమే మళ్లీ ‘ఆపరేషన్‌ లోటస్‌’కు పూనుకుందని మండిపడ్డారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ మధ్య ఉన్న పొత్తుకు వచ్చిన ప్రమాదమేమీ లేదని శివకుమార్‌ విశ్వాసం వ్యక్తంచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: