ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ఆదివారం ఓ సంచలన కథనం వచ్చింది. ఏపీ రాజధాని అమరావతిలో దొంగలు చెలరేగిపోతున్నారన్నది దాని సారాంశం. అయితే ఈ దొంగలు ఇళ్లలో సొమ్ములు దోచుకెళ్లే దొంగలు కాదు.. రాజధానిలో భారీగా జరుగుతున్న నిర్మాణాల వద్ద సామగ్రి దోచుకెళ్లే దొంగలు.


రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చిన సామగ్రిని దర్జాగా ట్రాక్టర్లలో వచ్చి మరీ దొంగిలిస్తున్నారట. అంతేకాదు.. ఏకంగా మేము స్థానికులం అంటూ బెదిరిస్తున్నారట. అంతేనా.. మా వెనుక పెద్ద పెద్ద తలకాయలున్నాయి. మమ్మల్ని అడ్డుకుంటే ఖబడ్దార్‌ అంటూ సవాల్ కూడా చేస్తున్నారట.


ఇప్పటికే రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు ఆగిపోయాయంటూ పత్రికల్లో కథనాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి దొంగతనాల వార్తలు కూడా వస్తే అమరావతి బ్రాండ్ పడిపోవడం ఖాయం. ఈ వార్త నిజమైతే.. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోకపోతే.. చెడ్డపేరు రావడం ఖాయం.


ఈ దొంగతనాల వెనుక రాజధానికి చెందిన కొందరు ఘరానా వ్యక్తులు, రియాల్టర్లు ఉన్నట్లు ఆ పత్రిక రాసుకొచ్చింది. అంతేకాదు.. ఈ దొంగతనాలను అడ్డుకునేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని.. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వివరించింది. ఇప్పటికే కొన్ని నిర్మాణ సంస్థలు తుళ్లూరు పోలీసులకు చెప్పారట. పోలీసులు రాత్రివేళల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నా.. సిబ్బంది కొరత కారణంగా వారూ చోరీలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారట. ఈ విషయంపై జగన్ సర్కారు అత్యవసరంగా దృష్టి సారిస్తే మంచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: