ఏపీ సీఎం జగన్.. అధికారంలోకి వచ్చి ఓ 40 రోజులు అవుతుందో లేదో.. అప్పుడే తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా డిమాండ్లు వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగినా ఇంకా ఎందుకు జగన్ రాజీనామా చేయలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మాత్రం దానికే రాజీనామా ఏంటి అనుకుంటున్నారా..


దీనికి కూడా ఓ లాజిక్ ఉంది.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే అప్పుడు విపక్ష నేతగా ఉన్న జగన్ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారట. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మీరు ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని లోకేశ్ జగన్ ను ప్రశ్నిస్తున్నారు.


అంతేకాదు... కేసుల భయంతో మీరు కేంద్రానికి దాసోహం అనొచ్చు. కానీ అందుకోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే హక్కు మీకెక్కడిది ? అని లోకేశ్ ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ ను ప్రశ్నించారు. జగన్ గారూ.. మీరు మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేదు. ఏది మీ పోరాటం? ఏది మీ మడమ తిప్పని నైజం? అంటూ లోకేశ్ ప్రశ్నించారు.


కాళ్ళకు సాష్టాంగ పడటం, భజన చేయడమే పోరాటం అనుకుంటున్నారా? ఏపీ ప్రయోజనాలను సాధించడానికి మీరేం చేయదలచుకున్నారో చెప్పండి. ఇది ప్రజల తరపున మా డిమాండ్.. అంటూ తన పోస్టును ముగించారు లోకేశ్.. ఏదేమైనా సీఎంగా జగన్ రాజీనామా కోసం నారా లోకేశ్ అప్పుడే డిమాండ్ మొదలుపెట్టేశారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: