ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చివరి దశకు వచ్చిందని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. జాతీయ స్థాయిలో బీసీ కులాల వర్గీకరణ దిశగా ముందుకెళ్తున్న భాజపా ప్రభుత్వం, ఎస్సీ వర్గీకరణను ఇంకెంతో కాలం తొక్కిపెట్టలేదని అభిప్రాయపడ్డారు. తమ పోరాటానికి విస్తృత మద్దతు లభిస్తున్నందున బీసీలతో పాటు, ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసిందన్నారు.

 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భవించి పాతికేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మంద కృష్ణ ‘ఈనాడు-ఈటీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ‘‘మాదిగల ఆత్మగౌరవ జాతర’’ పేరుతో ఆదివారం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

ఎస్సీల వర్గీకరణ ఉద్యమం 1994లో ప్రారంభమైంది. 1999లో చంద్రబాబు హయాంలో వర్గీకరణ పూర్తయి 2004 వరకూ దాని ఫలాలు అనుభవించాం. ఫలితంగా మాదిగ ఉపకులాలకు చెందిన 22 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, వేలమందికి ఉన్నత విద్య అవకాశాలొచ్చాయి. వర్గీకరణను అడ్డుకోవాలన్న కుట్రతో కొందరు స్వార్థపరులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. వర్గీకరణ పార్లమెంటు తీసుకోవాల్సిన నిర్ణయమని సుప్రీం తీర్పునిచ్చింది. నిర్ణయం కేంద్ర పరిధిలో ఉన్నా పాతికేళ్లుగా సహనం కోల్పోకుండా పోరాడాం.

 

25 ఏళ్ల ప్రస్థానంలో మా ఆత్మగౌరవాన్ని నూటికి నూరుపాళ్లు సాధించాం. మాదిగ అనే పేరుతో సమితి ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు చాలా మంది వద్దన్నారు. కులం పేరు ఇతరులకు తెలిస్తే చిన్నచూపు చూస్తారనే ఆత్మన్యూనతతో వద్దన్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఉద్యమ రూపంలో తెలుగు రాష్ట్రాలను ప్రభావితం చేస్తూ బలమైన ముద్ర వేస్తున్నాం. వర్గీకరణ ఇప్పుడో జాతీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: