ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క‌ మ‌లుపులు చోటు చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఏపీపై బీజేపీ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింద‌నే వార్త‌లు వ‌స్తున్న త‌రుణంలో...ఇంకో కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఇందుకు రాష్ట్రం కాకుండా అమెరికా వేదిక అయింది. తెలుగువారికి కార్య‌క్ర‌మాల వేదిక అయిన తానాలో ఇది జ‌రిగింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 22వ తానా మహాసభలు అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ తో భేటీ అవ‌డం సంచ‌ల‌నంగా మారింది. 


వాషింగ్టన్ డీసీలో జ‌రుగుతున్న 22వ తానా మహాసభల్లో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి రామ్‌మాధవ్ అమెరికా వెళ్లారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం అక్క‌డికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రు రహస్యంగా సమావేశమయ్యారని తెలుస్తోంది. ఏపీలో నెలరోజుల వైఎస్ జగన్ పరిపాలనపై ఇరువురి మధ్య చర్చ జరగ్గా.. విభజన హామీలు, ఏపీకి కేంద్రం చేసిన సాయంపై కూడా చర్చించారు. జాతీయ రాజకీయాలు, ఏపీకి కేంద్రం ఇంకా ఏం చేయాల్సి ఉందన్న అంశంపైనా ఇద్దరూ మాట్లాడుకున్నారు. రాష్ట్ర విభజనతో లోటుబడ్జెట్‌లోకి వెళ్లిపోయిన ఏపీకి కేంద్రం చేయాల్సిన సాయం, రాష్ట్రానికి ఏం చేస్తే మంచిదనేదానిపై మంతనాలు జరిగినట్టు తెలుస్తోంది.


2014 ఎన్నికల్లో ఏపీ టీడీపీ-బీజేపీ కూటమితో కలిసి పనిచేసిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత క్రమంగా వారికి దూరమయ్యారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్‌పెట్టిన భారతీయ జనతా పార్టీ.. ఇతర పార్టీల నేతలను కమలం గూటికి ఆహ్వానిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌ బలంగా జరుగుతోందని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్-రాంమాధవ్ భేటీ చర్చకు దారితీస్తోంది. అదే స‌మ‌యంలో, కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీస్తోందా అనే ప్ర‌శ్న సైతం తెర‌మీద‌కు వ‌స్తోంది.

ఇదిలాఉండ‌గా, పవన్ కల్యాణ్ తానా వేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు. తానా మహాసభలకు నన్ను పిలవడం నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నాన్న ఆయన.. ఈ ఈవెంట్‌లో పాల్గొనడం గర్వంగా ఫీలవుతున్నానని తెలిపారు. చిన్నప్పటి నుంచి నేను నటుడిని అనే భావన నాకు లేదు.. జీవితమే నన్ను నటుడిని చేసిందన్నారు పవన్... ఎవరైనా సమాజంలో బాధపడితే.. అది నన్ను చాలా బాధపెట్టేది.. ఈ భావనే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందన్న ఆయన... తానా మహాసభల వేదికగా నా ఓటమికి గురించి మనస్సు విప్పి మాట్లాడుతున్నా.. ప్రతీ అపజయం విజయానికి దారేనని స్పష్టం చేశారు. నేను చాలా ఆలోచించిన తర్వాతే జనసేన పార్టీ పెట్టా.. సినిమాల్లో అవకాశాలున్నా.. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నా.. దేశసమగ్రతకే భంగం కలుగుతుందనే భయం నాలో ఉండేది.. ఉన్న రాజకీయ నేతలు ఎవరూ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఉంది.. సరికొత్తతరానికి యువతలో ఉన్న ఆవేదనను గలం వెప్పడానికే జనసేన పెట్టా... యువత ఆవేదన బయటకు చెప్పకపోతే నేను తప్పుచేసినవాడిని అవుతానని భయపడ్డానని పవన్ కల్యాణ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: