ఎంతో మంది పేదలు పెళ్లి తంతుతో అప్పుల ఊబిలో ఇరుక్కొని ఆస్తులను అమ్ముకుంటున్న కుటుంబాలు అనేకం ఉండేవని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వారి కోసమే కల్యాణలక్ష్మి పథకాన్ని కేసీఆర్‌ తీసుకొచ్చారని చెప్పారు. బాన్సువాడ మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శనివారం బాన్సువాడ, బీర్కూర్‌ మండలాలకు చెందిన 211 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 50 వేలతో ప్రారంభమైన ఈ పథకాల ద్వారా ప్రస్తుతం రూ. 1,25,116లు అందజేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5.70 లక్షల మంది లబ్ధిపొందారని చెప్పారు. నియోజకవర్గంలో ఎనిమిది వేల మందికి చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆడబిడ్డ పెళ్లి చేయడం కన్నవారి బాధ్యతని.

 

ఆ బాధ్యతను ప్రభుత్వం భుజాన వేసుకుందన్నారు. గతంలో చెక్కులు పెళ్లి కూతురు పేరుపై ఇచ్చే వాళ్లమని, ప్రస్తుతం తల్లి పేరు మీద ఇస్తున్నట్లు తెలియజేశారు. గ్రామాల్లో పెళ్లి నిశ్చయమైన సంగతి ప్రజాప్రతినిధులకు, నాయకులకు ముందుగానే తెలుస్తుందని, పెళ్లి కూతురు ఇళ్లకు వెళ్లి దరఖాస్తు చేసే బాధ్యత తీసుకోవాలన్నారు.

 

మూడు మాసాలు నిండిన గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీరజారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు పద్మ, ఆర్డీవో రాజేశ్వర్‌, తహసీల్దార్‌ సుదర్శన్‌, రైసస జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: