కృష్ణా నది కరకట్ట వెంబడి నిర్మించిన కట్టడాలు అక్రమమని సీఆర్డీఏ వాటి యజమానులకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు టార్గెట్‌గా ఈ నోటీసులు జారీ చేశారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ అక్రమ కట్టడాల కూల్చివేత వ్యవహారం బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు ఆగ్రహం తెప్పించింది. సీఆర్ఢీఏ నుంచి నోటీసులు అందుకున్న ఆయన.. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తనది అక్రమ కట్టడం అయితే దాన్ని తానే దగ్గరుండి కూల్చి వేయిస్తానన్నారు.

 

భవనాలకు అన్నిఅనుమతులూ ఇచ్చి ఇప్పుడు అక్రమ కట్టడాలు అని ఎలా అంటారని ఆయన మండిపడ్డారు. గతంలో ఇరిగేషన్ అధికారులే నదిలో గోడ కట్టుకోమని అనుమతి ఇచ్చారని చెప్పారు. నదిని తానెక్కడా ఆక్రమించలేదన్న గోకరాజు గంగరాజు.. నదిలోనే తన భూమి కలిసిపోయిందన్నారు. తనకు ఉడా, ఇరిగేషన్ అధికారుల నుంచి అన్ని అనుమతులు ఉన్నాయన్నారు.

 

కృష్ణా కరకట్టపై ఎకరాల భూమిని తాను దానమిచ్చానన్నారు. ఇది అక్రమ కట్టడం అయితే భవానీ ఐల్యాండ్‌లో పర్యాటక శాఖ నిర్మించిన గెస్ట్ హౌస్‌లు, బెరంపార్క్‌లోని నిర్మాణాలన్నీ అక్రమ కట్డడాలే అవుతాయన్నారు. అక్రమ కట్టడాలను కూల్చేయదలిస్తే రాష్ట్రంలో నదుల ఒడ్డున ఉన్న అన్ని కట్టడాలను కూలుస్తారా అని ప్రశ్నించారు. దుబాయ్‌లో సముద్రాన్నిపూడ్చి కృత్రిమ కట్టడాలు నిర్మిస్తుంటే.. ఇక్కడ మాత్రం నది ఒడ్డున ఉన్న వాటిని కూలుస్తామని అంటున్నారన్నారు.

 

నది ఒడ్డున కట్టడాలు లేకపోతే పర్యాటకం ఎలా అబివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. నది ఒడ్డున తాను ఉచితంగా ఇచ్చిన భూమిలోనే మంతెన సత్యన్నారాయణ రాజు ప్రకృతి చికిత్సాలయం నిర్మించారని, అందులో ఎలాంటి వ్యాపారం చేయడం లేదన్నారు. ఎందరో రోగులకు చికిత్స అందిస్తున్న ఆ ఆశ్రమాన్ని అక్రమ కట్టడం అని ఎలా అంటారని ప్రశ్నించారు. జగన్ ని బాబు వదిలేశారని ఎద్దేవా చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: