టీడీపీకే గెలిచిన వారు కనాకష్టంగా 23 మంది. అందులో బాబు, ఆయన గారి బావమరిది బాలయ్య పోనూ 21 మందే ఉన్నారు. వీరిని కూడా ఏరేయాలని ఓ వైపు బీజేపీ నానా ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు వారిపై ఓడిన  వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దులు  కోర్టుకు వెళ్తున్నారు. దీంతో టీడీపీ గంపలో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారో చూడాలి.


ప్రకాశం జిల్లా చీరాలలో తాజా ఎన్నికలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆమంచి క్రిష్ణమోహన్ పై టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం గెలిచారు. అయితే కరణం ఎన్నిక చెల్లదంటూ ఇపుడు ఆమంచి కోర్టుకు ఎక్కారు. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు తప్పుడు వివరాలతో ఉన్నాయని కూడా ఆమంచి ఫిర్యాదు చేస్తున్నారు.


భార్య, తనపై ఆధారపడి జీవిస్తున్న వారి వివరాలను బహిర్గతం చేయకుండా బలరాం తొక్కిపెట్టారని కృష్ణమోహన్ పేర్కొన్నారు. నామినేషన్‌లో భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయనకున్న మరో భార్య ప్రసూన గురించి ప్రస్తావించలేదు. తనపై ఆధారపడి జీవిస్తున్నవారు ఎవరూ లేరని తెలిపారు. ప్రసూన గురించి, ఆమె ఆదాయం, ఆస్తి, అప్పుల గురించి వివరించలేదు. పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యుల సమక్షంలో 1985లో ప్రసూనతో బలరామకృష్ణ మూర్తి వివాహం శ్రీశైలంలో జరిగింది. కరణం  బలరాం, ప్రసూనలకు అంబిక కృష్ణ 1989లో హైదరాబాద్‌లోని సెయింట్‌ థెరిస్సా ఆస్పత్రిలో జన్మించింది. 


అంబిక ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌లో, ఆధార్‌ కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉంది. అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టినరోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం ఉన్నారు. అంబిక కృష్ణ ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీ చదువుతోంది. బలరాం తన నామినేషన్‌లో ప్రసూన, అంబిక కృష్ణల వివరాలను పొందుపరచకుండా దాచిపెట్టారు.


ఎన్నికల చట్ట నిబంధనల ప్రకారం.. కరణం నామినేషన్‌ను చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్‌గా పరిగణించడానికి వీల్లేదు. అందువల్ల ఆయన నామినేషన్‌ను చెల్లనిదిగా ప్రకటించాలి. బలరాం ఎన్నికను రద్దు చేయండి. అంతేకాకుండా చీరాల నియోజకవర్గం నుంచి నేను ఎన్నికైనట్లు ప్రకటించండి’ అని కృష్ణమోహన్‌ తన పిటిషన్‌లో వివరించారని ఆ కధనం తెలిపింది. మొత్తానికి కరణం తో రణం పెట్టున్నారు ఆమంచి. కోర్టు కనుక బలరాం ఎన్నిక చెల్లదని తీర్పు ఇస్తే మాత్రం టీడీపీకి ఓ వికెట్ పడిపోయినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: