పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో ఊహించ‌ని క‌ల‌క‌లం రేగిన సంగ‌తి తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత జేడీఎస్‌తో జట్టు కట్టిన కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌గా....సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు తొమ్మిది మంది ఉండగా... ముగ్గురు జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు బీసీ పాటిల్‌, మునిరత్న, ప్రసాద గౌడ పాటిల్‌, శివరామ, రామలింగా రెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్‌, రమేశ్‌ జక్కహళ్లి ఉన్నారు. పార్టీ నాయకత్వానికి చెప్పకుండా నేరుగా రాజీనామాలతో స్పీకర్‌ను, గవర్నర్‌ను కలుస్తున్న అసంతృప్త నేతలపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా.. ఈనెల 9న కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 


ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి అందుబాటులో లేరు. సంక్షోభం స‌మ‌యంలో ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండగా... ఆదివారం బెంగళూరు చేరుకున్నారు. కర్ణాటకలో తాజా పరిణామాలపై డిప్యూటీ సీఎం పరమేశ్వర, మంత్రి డీకే శివకుమార్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంత‌రం ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు సంభ‌వించాయి. కాంగ్రెస్ పార్టీ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ భేటీకి ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని సర్క్యులర్‌ హెచ్చరించింది. ఈ సీల్పీ భేటీకి కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావు కూడా హాజరవుతారని తెలిసింది.


కాగా, కర్ణాటకలో సంక్షోభంపై మాజీ సీఎం, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప స్పందించారు. మంత్రులు, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో తనకు సంబంధం లేదన్నారు. సీఎం కుమార స్వామి, మాజీ సీఎం సిద్ధరామయ్య చేస్తున్న ఆరోపణలపై తాను స్పందించాల్సిన అవసరం లేద‌న్నారు. తాజా రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే అని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: