శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచం వాయువేగంతో దూసుకుపోతుంటే భారత్‌ను ఇప్పటికీ మూడాచారాలు పట్టి పీడిస్తున్నాయి. అనాధిగా అభివృద్ది చెందుతున్న దేశంగానే భారత్‌ మిగిలిపోతోంది. దానికి ప్రధాన కారణం మూడనమ్మకాలు, కల్పిత కథలేనన్నది జగమెరిగిన. క్షుద్రపూజలు చేస్తే ఎవరికీ చావనేది రాదని ముక్కుమొఖం తెలియని వ్యక్తి చెప్పడంతో దానిని గుడ్డిగానమ్మి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం అర్ధరాత్రి క్షుద్రపూజలకు కొందరు ఉపక్రమించారు. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ సర్పవరం పోలీసులు రహస్యంగా పూజలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని క్షుద్రపూజా నిర్వాహకుల ఎత్తులు తాయొత్తులకు అడ్డుకట్టవేశారు. 


వివరాల్లోనికి వెళ్తే ... కాకినాడ స్మార్ట్‌ సిటీ పరిధిలోని గొడారిగుంట సీతారామనగర్‌ రామాలయం వెనుకనే ఉన్న సగర కమ్యూనిటీ హాల్లో ఆదివారం రాత్రి 10 గంటలకు ఆ కమ్యూనిటీ హాల్లో లైట్లు వెలుగుతున్నాయి. హాలు సమీపంలో సాంబ్రాని దూపం వాసనలు  వెదజల్లుతున్నాయి, కోళ్లు అరుపులు వినిపిస్తున్నాయి. అదే హాలు ముందు బయట ఆవరణలో సుమారు ఆరుగురు వ్యక్తులు కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. ఎప్పడూ చీకటిగా ఉండే ఆ ప్రాంతంలో హాల్లో లైట్లు వెలుగుతుండటం, బయట చీకట్లో కొందరు కూర్చుని ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 


కాకినాడ సర్పవరం పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని కమ్యూనిటీ హాల్లో పరిశీలించగా మూడు మట్టికుండల్లో  మంటలు వెలుగుతున్నాయి. వాటి పక్కనే పసుపు, కుంకుమ పోగును వేశారు. నిమ్మకాయలు, కొబ్బరికాయలు, రెండు బతికున్న నాటుకోళ్లు, మాంత్రికులు కూర్చున్న చోట ముగ్గులు పెట్టి ఉండటాన్ని పోలీసులు గమనించారు.  అక్కడకు చేరుకున్న సర్పవరం పోలీసులు మాంత్రికులను నిలదీయగా సమాదానం చెప్పేందుకు వెనుకాడారు. అనంతరం గ్రామ పెద్దలు కల్పించుకుని తమ గ్రామంలో ఇటీవల చాలా మంది మృతిచెందారని, ఇకపై అటువంటివి జరగకుండా నిలువరించేందుకు పూజలు చేయిస్తున్నామని బదులిచ్చారు. 


అందుకు సర్పవరం పోలీసులు తగిన సమాదానమిస్తూ...  ప్రజాహితం కోసమైతే  పగటిపూట అందరికీ తెలిసేలా చేయవచ్చని, అర్ధరాత్రలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనగానే వారు నీళ్లు నమిలారు. రహస్యంగా క్షుద్రపూజలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను, గ్రామ పెద్దలను సర్పవరం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ క్షుద్రపూజల వెనుక అనేక రాజకీయ సామాజిక రుగ్మతలున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో సీతారామనగర్‌కు చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. వారిరువురి మధ్య అనేక సార్లు కొట్లాటలు చోటుచేసుకున్నాయి.

రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని తలపించేట్టుగా కత్తులు,కర్రలతో ఆ రెండు వర్గాలు అనేకసార్లు కొట్లాటకు తెగబడ్డారు. ఒక వ్యక్తి తలకు బలమైన గాయం కావటంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. దానికి తోడు ఈ ప్రాంతంలో బాల్యవివాహాల పర్యవసానంగా ఏర్పడ్డ కుటుంభ కలహాలతో ఇటీవల కొందరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ కారణాల రీత్యా గ్రామ పెద్దల్లోని ఒక వర్గం మాంత్రికులను సంప్రదించగా పేటకు అరిష్టం పట్టిందని క్షుద్రపూజలు చేయించి శాంతి చేయాలని బదులిచ్చినట్టు తెలిసింది. ఇదే అధనగా క్షుద్రపూజలు నిర్వహించి పేటలోని మహిళలను, ప్యత్యర్ధి వర్గాన్ని బయపెట్టాలని భావించిన గ్రామ పెద్దలు గోప్యంగా క్షుద్రపూజలు నిర్వహించతలపెట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: