జి.వెంకటస్వామి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ‘‘సచివాలయం కూల్చివేత - కొత్త అసెంబ్లీ నిర్మాణం’’పై అఖిలపక్షాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ జి.వివేక్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌, భాజపా, తెదేపా, సీపీఐ, తెజస పార్టీల నాయకులు, వివిధ సంస్థలు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

ప్రస్తుత సచివాలయాలన్ని కూలగొడతామంటే చూస్తూ ఊరుకోం.. అడ్డుకుంటాం అని అఖిల పక్షాలు హెచ్చరించాయి. కొత్తగా భవనాలను కట్టాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న యావత్‌ తెలంగాణ ప్రజానీకాన్ని కూడగట్టి ఉద్యమించాలని నిర్ణయించాయి. కూల్చివేతపై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు వదిలేది లేదని స్పష్టం చేశాయి.

 

సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చొద్దని సోమవారం గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు. అన్ని పార్టీల నాయకులు గవర్నర్‌ను కలిసి, ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చి చారిత్రక కట్టడాల విధ్వంసాన్ని అడ్డుకోవాలని తీర్మానించారు. ప్రజాసమస్యలు, వారి అవసరాలను తీర్చడానికి ఐక్య పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నాయకులు ప్రకటించారు.

 

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారో, కొత్తగా అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించడం ఎందుకో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. ఉన్నవాటిని కూల్చేసి, కొత్తవి కట్టడమంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: