పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో రాజకీయం ఊహించ‌ని మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. 14 నెలల తన ప్రభుత్వ మనుగడకు ముప్పు వాటిల్లడంతో అమెరికా పర్యటనలో ఉన్న సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆగమేఘాల మీద ఆదివారం రాత్రి బెంగళూరు చేరుకున్నారు. వచ్చీ రావడంతోనే నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో జేడీఎస్‌ ఎల్పీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలూ హాజరయ్యా రు. ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు ప్రారంభించారు. అవసరమైతే సీఎంను మార్చడానికి సైతం వారు సిద్ధపడినట్టు తెలుస్తోంది. 


అయితే, దీంతో పాటుగా ఊహించ‌ని ఎత్తుగ‌డ‌లు వేసేందుకు అధికార జేడీఎస్‌- కాంగ్రెస్ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంది. కర్ణాటకలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో పరమేశ్వర మాట్లాడుతూ...ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తాము ఎలా స్పందిస్తామో త్వరలోనే చూస్తారని ఆయన చెప్పారు.  ``భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో అందరికీ తెలుసు. అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారు. ఆ తర్వాత వారికి వసతి కల్పించి కాపాడుకుంటాం` అని పరమేశ్వర స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై నిన్న రాత్రి సీఎం కుమారస్వామితో చర్చించానని తెలిపారు. కుమారస్వామి ప్రభుత్వంలో పని చేయడం ఇష్టం లేకనే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని విలేకరులు వేసిన ప్రశ్నకు పరమేశ్వర బదులిస్తూ.. ఆ విషయం తనకు తెలియదన్నారు.


మ‌రోవైపు, కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. స్వతంత్ర ఎమ్మెల్యే హెచ్‌. నగేశ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవలే సీఎం కుమారస్వామి మంత్రివర్గంలో నగేశ్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే రాజీనామా చేసి ముంబైలో ఉన్న ఎమ్మెల్యేలతో నగేశ్‌ జతకట్టారు. కుమారస్వామి ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నానని నగేశ్‌ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేయగా...మిగిలిన మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. మరికాసేపట్లో రాజ్‌భవన్‌కు సీఎం కుమారస్వామి వెళ్లనున్నారు. మంత్రుల రాజీనామా పత్రాలతో గవర్నర్‌ను కుమారస్వామి కలవనున్నారు. త‌ద్వారా బీజేపీ ఎత్తుకు పై ఎత్తు వేయ‌నున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: