కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ముఖ్యమంత్రి కుమారస్వామి ఆసక్తికరంగా స్పందించారు.  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను పార్టీ చీఫ్‌ కు సమర్పించారు. డీప్యూటీ సీఎం పదవికి పరమేశ్వర కూడా రాజీనామా చేశారు. లేఖలను తీసుకొని సీఎం కుమారస్వామి గవర్నర్‌ తో సమావేశం కానున్నారు.  2018, మే నెలలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 224 సీట్లకుగాను బీజేపీకి 105 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ఏడు సీట్లు తగ్గాయి. కాంగ్రెస్‌ పార్టీకి 78 సీట్లు, జనతాదళ్‌ (సెక్యులర్‌)కు 37 సీట్లు వచ్చాయి.


బీజేపీని అధికారంలోకి రాకుండా నివారించడం కోసం కాంగ్రెస్, జనతాదళ్‌ పార్టీలు అంగీకారానికి వచ్చి ఒక బీఎస్పీ సభ్యుడు, ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  దాంతో తెరపైకి వచ్చిన జేడీఎస్ తన ప్రతాన్ని చూపించింది.  ఆ పార్టీ నేత కుమార స్వామి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు.  కానీ అప్పటి నుంచి ఆయనకు ఆ పదవి దిన దినగండంగానే కొనసాగుతూ వచ్చింది. ఏ క్షణంలో తన పదవి ఊడిపోతుందో అన్న అసహనంతోనే ఆయన పాలన కొనసాగించారు.


ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు రాజీనామాలకు సిద్దం కావడంతో కర్ణాటక ఎపిసోడ్ మళ్లీ హాట్ హాట్ గా తెరపైకి వచ్చింది.  మరోవైపు రాజీనామా చేసిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నగేశ్ ప్రత్యేక విమానంలో ముంబయి బయలుదేరారు. నగేశ్‌ వెళ్లిన విమానంలో బీజేపీ నేత యాడ్యూరప్ప  పీఏ ఉండడటం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ముంబయిలో సమావేశమయ్యారు.


ఈ నేపథ్యంలో  కుమార స్వామి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలి పోతుందా ? కూలిపోతే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా ? అసలు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తారా ? ఆమోదించకపోతే ఏమవుతుంది ? రాష్ట్ర గవర్నర్‌ జోక్యం చేసుకుంటారా ? కర్ణాటక అసెంబ్లీ భవిష్యత్తు ఏమిటీ ? అనేది ఆసక్తిగా మారింది.  దేశ వ్యాప్తంగా ఇప్పుడు బీజేపీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో మరోసారి బీజేపీ ఫామ్ లోకి రాబోతుందా అని విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: