కర్ణాటకలో నెలకొన్న తాజా పరిణామాల వెనక భాజపా హస్తం ఉన్నట్లు కాంగ్రెస్‌ చేస్తున్న వ్యాఖ్యలను భాజపా ఖండించింది. స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్‌ రాజీనామా చేసి భాజపాకు మద్దతిస్తానని తెలపడంపై ఆ పార్టీ స్పందించింది. దీనిపై పార్టీ నాయకురాలు శోభ మాట్లాడారు. తమ పార్టీలోకి ఎవరొచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపారు. అసమ్మతి నేతలతో భాజపా నేతలెవ్వరూ టచ్‌లో లేరని స్పష్టం చేశారు.

 

కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. మెజారిటీ కోల్పోయినందున ఆయనకు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టారని తెలిపారు. మరో ప్రభుత్వం ఏర్పాటు కోసం కుమార స్వామి దారివ్వాలన్నారు.

 

మరోవైపు కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరినప్పటికీ తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదంటూ కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేసిన నేతలకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఇచ్చిన గడువు పూర్తయింది.

 

తాజాగా ఈరోజు ఇద్దరు మంత్రులు తప్పుకోవడంతో కర్ణాటక రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థి నగేశ్‌, మరోనేత రహీమ్‌ అహ్మద్‌ ఖాన్‌ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి..రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. తాజాగా రాజీనామా చేసిన నగేశ్‌..ప్రత్యేక విమానంలో ముంబయికి పయనమయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: