కర్ణాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చలవేనని, దీనికంతటికీ స్క్రిప్టు రచయిత ఆయనేనని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం నుంచి ఎవరూ ముఖ్యమంత్రిగా ఉండకూడదన్న కారణంగానే సిద్ధరామయ్య ఈ సంక్షోభ పథక రచన చేశారని ఆరోపించారు.

 

కాంగ్రెస్ పార్టీలో జి.పరమేశ్వర ప్రత్యామ్నాయ నేతగా ఎదగడం కూడా ఆయనకు ఇష్టం లేదన్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు సిద్ధరామయ్య చేతులు కూడా దాటిపోయినట్టు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. 'ముంబైలో ఉన్న ఎమ్మెల్యేలు ఏకకట్టు మీద ఉన్నారు. కర్ణాటకకు తిరిగి వెళ్లడం కానీ, కాంగ్రెస్, జేడీఎస్‌లోకి తిరిగి వెళ్లడం కానీ చేసేది లేదని తెగేసి చెబుతున్నారు.

 

దీంతో సిద్ధరామయ్య ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమంటూ ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా గర్హనీయం. సిద్ధరామయ్య స్వార్థ ప్రయోజనాల కారణంగానే కుమారస్వామి ప్రభుత్వం అస్థిరత్వంలో పడింది' అని ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి బీజేపీ ఎంతమాత్రం కారణం కాదని, కాంగ్రెస్-జేడీఎస్‌లు పరిస్థితిని చక్కదిద్దుకుంటే బీజేపీకి వచ్చే సమస్య ఏమీ లేదని జోషి అన్నారు.

 

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ నేతలు వరుస రాజీనామాలు చేస్తూ పోతుండటమే ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ రాజీనామాతోనే ఇది మొదలైందన్నారు. నాయకుడు లేనందున ఏం చేయాలో ఇతరులకు దిశానిర్దేశం చేసే వారు ఆ పార్టీలో లేకుండా పోయారని, అందుకు నిదర్శనమే కర్ణాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభమని జోషి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: