ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలు నిలిపివేయడంతో పని లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెదేపా సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ ఆరోపించారు. తన కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, నిజంగా తప్పుంటే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా 40 రోజుల పాలనలో ప్రజలకు నిరాశే మిగిలిందని వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధిని నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

 

ఇసుక లేకపోవటంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని తెలిపారు. పట్టిసీమ నీరు ఆలస్యం కావటంతో ఖరీఫ్ ఇంకా మొదలు కాలేదని... విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కినా పట్టించుకోని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.

 

ప్రజావేదిక కూల్చటం ద్వారా సీఎం జగన్‌ ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్నారని అన్నారు. చంద్రబాబుని ఇల్లు ఖాళీ చేయించటంపై ఉన్న శ్రద్ధ జగన్‌కు ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని ఎద్దేవా చేశారు. ఈయనగారికి నాశనం చేయడం తప్ప, సృష్టించడం చేతకాదని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: