తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆయా అంశాల‌పై స్పందించే తీరు ఎంతో భిన్నంగా ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌పై వ్యూహాత్మ‌కంగా క‌దులుతున్న కేసీఆర్ తాజాగా మ‌హాన‌గ‌రం కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర రాజధానిలో అత్యంత ప్రధానమైన తాగునీటి సమస్యపై ధీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేయాలని  అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదుల్లోంచి నగరానికి నీటిని తరలిస్తున్నామని, అయినా అవి ఏడాది పొడవునా నగర వాసుల అవసరాలు తీర్చలేకపోతున్నాయని సీఎం అధికారులకు తెలిపారు. ఇప్పుడున్న తాగునీటి వ్యవస్థ భవిష్యత్తులో ఏమాత్రం సరిపోదని చెప్పారు. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. పదేళ్ళ ముందుచూపుతో హైదరాబాద్‌ మహానగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు చర్యలు ప్రారంభించాలని సూచించారు.


గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో నీటి కొర‌త‌పై ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శరవేగంగా విస్తరిస్తున్న నగర శివార్లలో డెడికేటెడ్‌ మంచినీటి రిజర్వాయర్లను నిర్మించాలని అన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న ప్రతి ఇంటికీ మంచినీటి నల్ల కనెక్షన్‌ ఇవ్వడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, నిర్దిష్టమైన గడువు విధించుకుని లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ల నుంచి మంచినీటిని తరలించి, ప్రతిపాదిత రిజర్వాయ ర్లను నింపాలని, గరిష్ఠ నీటిమట్టం ఎప్పుడూ తగ్గకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అందుకోసం నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు సంయుక్తంగా సమావేశమై కొత్త రిజర్వాయర్ల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటుకు అంచనాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు.


ఈ సంద‌ర్భంగా మంచి నీటి విష‌యంలో కేసీఆర్ త‌న ప్ర‌ణాళిక‌ల‌ను అధికారుల‌తో పంచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్‌, కొంపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్లను ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతోంది. ఈ ప్రాజెక్టుల వద్ద అందుబాటులో ఉన్న నీటిలో 10శాతం మహానగర మంచినీటి అవసరాల కోసం వాడుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారు. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తుచేశారు. ఈ రెండు రిజర్వాయర్ల నుంచి మంచినీటిని హైదరాబాద్‌కు తరలించేందుకు కేశవరం దగ్గర ఒక భారీ రిజర్వాయర్‌ నిర్మించాలన్నారు. అక్కడే వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటును కూడా నిర్మించి నీటి అవసరాలు తీర్చేందుకు చర్యలు ప్రారంభించాలని సూచించారు. కృష్ణా, గోదావరి నీటిని ప్రస్తుతమున్న పద్ధతుల్లో తరలిస్తూనే ప్రత్యామ్నాయ పద్ధతిలో రిజర్వాయర్లను నిర్మించాల్సిన అవసరం ఉందని, అందుకోసం సాధ్యమైనంత త్వరలో ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: